వైసీపీనుంచి జనసేనలోకి చేరికలు..! నిజమెంత..?
కాకినాడ నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించడం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుటుంబాలకు జనసేన భరోసా అందించడం, ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు.. నాదెండ్ల హడవిడి మామూలుగా లేదు.
తెలంగాణలో రాజకీయ వలసలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఎవరెవరు ఏగట్టున ఉన్నారో, ఉంటారో చెప్పడం కాస్త కష్టంగా మారింది. ఎన్నికల టైమ్ కాబట్టి వలసలు, చేరికలు కామన్ అనుకోవచ్చు. ఏపీలో చేరికలు అంటే కాస్త ఆలోచించాలి మరి. అందులోనూ అధికార వైసీపీనుంచి జనసేనలోకి నాయకులు చేరుతున్నారు అంటే కచ్చితంగా అనుమానించాలి. కానీ చేరికలు నిజమేనంటున్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. చేరికలోయ్ చేరికలు అంటూ జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వ్యవహారాన్ని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఎవరైనా నాయకులు పార్టీలో చేరాలనుకుంటే, అధినేతతో కండువా వేయించుకోవాలనుకుంటారు. జనసేనలో అది పెద్ద పనేం కాదు, ఓ మోస్తరు నాయకుడయినా పార్టీలో చేరతానంటే నేరుగా పవన్ కల్యాణే కండువాతో సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ జనసేనాని లేని సమయంలో నాదెండ్ల సమక్షంలో చేరికలు అంటే వారు ఏ స్థాయి నాయకులో అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో వైసీపీలో వారి స్థానం ఏంటి అనేది కూడా చెప్పకుండానే వైసీపీ నాయకులు జనసేనలో చేరిక అంటూ సరిపెట్టారు. వచ్చినవారికి వచ్చినట్టు నాదెండ్ల కండువాలు కప్పుకుంటూ వెళ్లారు.
నాదెండ్ల హడావిడి..
వాస్తవానికి పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీస్ కి వచ్చినప్పుడు కూడా ఇంత హడావిడి జరగడంలేదు, ఇప్పుడు ఆయన లేని టైమ్ లో నాదెండ్ల మనోహర్ మాత్రం ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తున్నారు. కాకినాడ నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించడం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుటుంబాలకు జనసేన భరోసా అందించడం, ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు.. నాదెండ్ల హడవిడి మామూలుగా లేదు. పవన్ లేకుండానే పార్టీపై తన ముద్ర చూపించాలని ఆయన ఉత్సాహపడుతున్నట్టు స్పష్టమవుతోంది. నాదెండ్ల వారసత్వం కంటిన్యూ అయితే.. పవన్ వెన్నుపోటు రుచిచూడాల్సి వస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.