టీడీపీ క్రమశిక్షణ అంటే ఇదేనా..? పోలీసులకు ఫిర్యాదు
టీడీపీ నేతలు మీడియా ముందు నీతులు చెబుతారని, వారి అనుచరులు మాత్రం తమవారి తలలు పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విచ్చల విడిగా విధ్వంసాలు, పార్టీల పేరుతో దాడులు.. టీడీపీ క్రమశిక్షణ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ఇప్పటి వరకూ మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేసిన నేతలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్.. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సార్కర్ కు ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఇవిగో సాక్ష్యాలు..
టీడీపీ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నా.. సాక్ష్యాలు లేవంటూ పోలీసులు కేసులు పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. రాజమండ్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి మొత్తం వీడియో ఫుటేజీలను అడిషనల్ ఎస్పీకి అందించారు మార్గాని భరత్. మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ టీడీ పుటేజీల ఉన్న పెన్ డ్రైవ్ ని.. సాక్ష్యాలుగా సమర్పించారు. టీడీపీ దాడిలో తలపగిలి గాయపడిన బాధితుడిని వెంటబెట్టుకుని అడిషనల్ ఎస్పీని కలిశారు భరత్. గతంలో ఇలాంటి విష సంస్కృతి రాజమండ్రిలో లేదని, టీడీపీ గెలిచిన తర్వాత ఇది మొదలైందని అన్నారు.
ఇక పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే.. తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు మార్గాని భరత్. అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నేతలు మీడియా ముందు నీతులు చెబుతారని, వారి అనుచరులు మాత్రం తమవారి తలలు పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.