నేడే వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల.. మేనిఫెస్టో కాస్త ఆలస్యం
కొత్త ఇన్ చార్జ్ లు, ఇంకా ప్రకటన రాని స్థానాల్లోని సిట్టింగ్ లు కాస్త ఆందోళనలో ఉన్నారు. ఈరోజు ఫైనల్ లిస్ట్ తో అందరికీ క్లారిటీ ఇవ్వబోతున్నారు జగన్.
వైసీపీ తుది జాబితా సిద్ధమైంది. ఈరోజు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆ జాబితాను సీఎం జగన్ విడుదల చేస్తారు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఆయన ప్రకటిస్తారు. ఈ కార్యక్రమం కోసమే ఈరోజు ఉదయం సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ఇదే ఫైనల్..
ఇప్పటిపే వైసీపీ నుంచి పలు జాబితాలు బయటకు వచ్చినా.. వాటిల్లో మార్పులు చేర్పులు జరిగాయి. కొన్నిచోట్ల రెండుసార్లు కూడా మార్పులు జరిగాయి. దీంతో కొత్త ఇన్ చార్జ్ లు, ఇంకా ప్రకటన రాని స్థానాల్లోని సిట్టింగ్ లు కాస్త ఆందోళనలో ఉన్నారు. ఈరోజు ఫైనల్ లిస్ట్ తో అందరికీ క్లారిటీ ఇవ్వబోతున్నారు జగన్. అటు కూటమి కూడా ఇంకా ఫైనల్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాల వల్ల టీడీపీ, జనసేనలో అసంతృప్తి ఓ రేంజ్ లో కనపడింది. వైసీపీలో ఆ ప్రభావం కాస్త తక్కువ. సీట్లు దక్కని సిట్టింగ్ లు పక్క చూపులు చూసినా, మిగతా వాళ్లు జగన్ తోనే ఉండటానికి నిర్ణయించుకున్నారు. తుది జాబితా తర్వాత ఫిరాయింపుల సీన్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశముంది.
మేనిఫెస్టో ఎప్పుడు..?
2019లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతున్న సీఎం జగన్.. సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి అంశాల్లో మాత్రం కాస్త వెనక్కి తగ్గారు. ఈసారి విడుదల చేయబోయే మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మద్యపాన నియంత్రణ, నిషేధంపై మరింత క్లారిటి ఇస్తారా..? సామాజిక పెన్షన్, అమ్మఒడి సాయంను మరింత పెంచుతారా..? ఉద్యోగ వర్గాలకు ఎలాంటి వరాలు ఉంటాయి..? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే. మేనిఫెస్టో కసరత్తు తుది దశకు చేరిందని వైసీపీ వర్గాలంటున్నాయి. ఈ నెల 18 నుంచి వైసీపీ ప్రచారం జోరందుకుంటుందని చెబుతున్నారు నేతలు.