వివేకా మర్డర్ విచారణలో సీన్ రివర్స్

వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ దాదాపు వారం రోజుల క్రితమే డేట్ ఫిక్స్ చేసి నోటీసు ఇచ్చింది. తీరా అనుమానితుడు విచారణ స్థ‌లానికి వస్తే విచారించాల్సిన అధికారులు అక్కడ కనబడలేదు.

Advertisement
Update:2023-03-12 12:00 IST

వినటానికే విచిత్రంగా ఉంది. అనుమానితుడిని విచారించేందుకు సీబీఐ దాదాపు వారంరోజుల క్రితమే డేట్ ఫిక్స్ చేసి నోటీసు ఇచ్చింది. తీరా అనుమానితుడు విచారణ స్థ‌లానికి వస్తే విచారించాల్సిన అధికారులు అక్కడ కనబడలేదు. అసలిది నమ్మేట్లుగా ఉందా? ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అనుమానితుడు. భాస్కర్ రెడ్డి అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రన్న విషయం తెలిసిందే.

ఎంపీనేమో హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసులోనే విచారిస్తున్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డినేమో కడపలోనే ఉన్న జైళ్ళ గెస్ట్ హౌస్‌లో విచారించాలని డిసైడ్ అయ్యింది. మార్చి 3వ తేదీనే ఈ విషయమై భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసిచ్చింది. విచారణ తేదీని మార్చాలని అనుమానితుడు కోరినా సీబీఐ కుదరదని చెప్పేసింది. దాంతో చేసేదిలేక భాస్కర్ రెడ్డి ఆదివారం గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అయితే విచిత్రంగా విచారణ చేయాల్సిన సీబీఐ అధికారులు మాత్రం ఎవరూ కనబడలేదు.

విచారణ అధికారులు కనబడకపోవటంతో వాకాబుచేసిన భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు అందుబాటులో లేరని సమాధానం వచ్చిందట. దాంతో కాసేపు వెయిట్ చేసి చేసేదిలేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. మామూలుగా అనుమానితుల కోసం విచారణాధికారులు వెయిట్ చేయటం మామూలే. విచారణకు రమ్మని నోటీసులిచ్చినా అనుమానితులు విచారణకు హాజరవుతారా లేదా అన్నది చివరి నిమిషంవరకు తెలియ‌దు. కొందరు విచారణకు హాజరవుతారు. మరికొందరు చివరి నిమిషంలో ఏదో సమాచారం ఇచ్చేసి విచారణకు హాజరుకాలేమని చెప్పి తప్పించుకుంటారు. విచారణకు మరో తేదీని అడిగేవాళ్ళు కూడా ఉంటారు.

కానీ ఇక్కడ సీన్ రివర్సులో జరిగింది. అనుమానితుడైన భాస్కర్ రెడ్డి విచారణకు గెస్ట్ హాస్‌కు చేరుకోవటం ఏమిటి? విచారించాల్సిన అధికారులు అడ్రస్ లేకుండా పోవటం ఏమిటో ఎవరికీ అర్థంకావటంలేదు. విచారించేందుకు గెస్ట్ హౌస్‌కు రాలేని సీబీఐ అధికారులు అదే విషయాన్ని ముందుగానే భాస్కర్ రెడ్డికి ఎందుకు చెప్పలేదో తెలియ‌దు. విచారించేందుకు రావటం కుదరదని పలానా తేదీన హాజరుకమ్మని అనుమానితుడికి చెప్పేస్తే బాగుండేది. భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను అరెస్టుకు సిద్ధపడే వచ్చినట్లు చెప్పటం కొసమెరుపు. తీరా చూస్తే అసలు విచారణాధికారులే రాకపోవటం విచిత్రంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News