సీఎం భద్రతపైనా ఏడుపేనా..?

ఇంతటి భద్రత ఎందుకు చేసుకున్నారంటే భయమట. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నాడు కాబట్టే ఏ మూల నుంచి ఎవరొచ్చి దాడిచేస్తారో అని భయపడి కొత్త చట్టం చేసుకున్నట్లు కనిపెట్టింది.

Advertisement
Update:2023-10-08 11:19 IST

టీడీపీ అనుకూల మీడియా ఏడుపు ఎక్కువైపోయింది. ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్దీ ఏడుపు బాగా పెరిగిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. లేకపోతే ముఖ్యమంత్రి భద్రత విషయంలో కూడా ఏడవటం ఏమిటో అర్థం కావటంలేదు. ‘ఏ ముఖ్యమంత్రికీ లేనివిధంగా’ అనే హెడ్డింగ్ తో మొదటిపేజీలో బాటమ్ స్టోరీ అచ్చేసింది. అందులో ప్రధానమంత్రితో పాటు దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనివిధంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం అత్యంత పటిష్టమైన స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(ఎస్ఎస్జీ) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించింది.

ఇప్పటికే సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు గట్టి భద్రత ఉంది కదా అని గుర్తుచేసింది. ఎస్ఎస్జీ భద్రతకు వీలుగా ప్రత్యేక చట్టమే చేసిందట. కొత్త చట్టం ప్రకారం జగన్ తో పాటు భార్య, తల్లి, విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకు కూడా ప్రాక్స్ మేట్ సెక్యూరిటీ అంటే అత్యంత సమీపంలో ఉండే సెక్యూరిటీ ఉండబోతోందని చెప్పింది. ఇలాంటి చట్టం చేసుకుని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవటం చాలా విచిత్రమని తేల్చేసింది.

ఇంతటి భద్రత ఎందుకు చేసుకున్నారంటే భయమట. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నాడు కాబట్టే ఏ మూల నుంచి ఎవరొచ్చి దాడిచేస్తారో అని భయపడి కొత్త చట్టం చేసుకున్నట్లు కనిపెట్టింది. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఏమిచేసినా దేశంలోనే వినూత్నమని, చరిత్రని పొగిడేవాళ్ళు. ఇప్పుడు జగన్ ఏమిచేసినా విడ్డూరం, విచిత్రం, భయమని రాస్తున్నారు. ఛ‌త్తీస్‌గ‌డ్, ఒడిశా ముఖ్యమంత్రులకు లేని సెక్యూరిటీ జగన్ కు అవసరం లేదని ఎల్లోమీడియా తేల్చేసింది.

విచిత్రం ఏమిటంటే.. వైఎస్సార్ సీఎం కాగానే చంద్రబాబు నాయుడుకు రోప్ పార్టీ ఇవ్వలేదని ఎల్లోమీడియా నానా గోలచేసింది. నిజానికి రోప్ పార్టీ అన్నది సీఎంకు తప్ప ఇంకెవరికీ ఉండదు. అలాగే దేశంలో ఏ ప్రతిపక్షనేతకు లేనంత సెక్యూరిటీ చంద్రబాబుకుంది. సెక్యూరిటీ తగ్గించకపోయినా నానా రచ్చ రచ్చచేసి కోర్టులో పిటీషన్ వేశారు. ఇప్పుడు జైలులో కూడా భద్రత పెంచాలని ఎంతగా ఎల్లోమీడియా గోలచేస్తోందో అందరూ చూస్తున్నదే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రెండుమూడు చోట్ల పర్మినెంటుగా కాన్వాయ్ లు ఏర్పాటు చేసుకున్నారు. ఇవంతా ఎల్లోమీడియాకు అతిగా, అనవసరమనిపించదు.

ఇప్పటికే ముఖ్యమంత్రికి అత్యంత పటిష్టమైన భద్రత ఉన్నపుడు మళ్ళీ ఎస్ఎస్జీ ఎందుకని తెగ బాధపడిపోయింది. ఇక్కడ ఎల్లోమీడియా సమస్య ఏమిటంటే.. ఏదోరకంగా ప్రతిరోజు జగన్ పైన వ్యక్తిగతంగానో లేకపోతే ప్రభుత్వంపైనో బురదచల్లేయాలన్నది టార్గెట్. అందుకు కొత్తగా ఏమీ దొరకకపోతే ఇలా వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తుంటారు. ఇప్పటికే భద్రత పేరుతో సెక్యూరిటీ సిబ్బంది చాలా అతిచేస్తున్నారట. అలాంటిది ఎస్ఎస్జీ కూడా ఏర్పాటైతే ఇంకెంత అతి చేస్తారో అని ఎల్లోమీడియా నిలదీసింది. పౌరహక్కులన్ని కాలరాస్తూ, జనాలను అణిచివేస్తున్న కారణంగా ఎవరు దాడిచేస్తారో అనే భయం జగన్‌లో పెరిగిపోతోంది కాబట్టి ప్రత్యేక సెక్యూరిటీ పెట్టుకున్నట్లు చెప్పింది.

Tags:    
Advertisement

Similar News