యాత్రకు ముందే ఉత్తరాంధ్రలో రాజధాని సెగలు..

ఈనెల 25న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ దీన్ని లీడ్ చేసినా, ఇతర అన్ని పార్టీల నాయకులు, విద్యావేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా అందరి భాగస్వామ్యం కోరుతున్నారు.

Advertisement
Update:2022-09-24 11:08 IST

అమరావతి యాత్ర ఉత్తరాంధ్రకు ఇంకా చేరుకోలేదు. ఈలోగా వైసీపీ నేతలు వార్నింగ్ లు ఇచ్చారు. దండయాత్రకు వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులే యాత్రపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇతర వర్గాలనుంచి పెద్దగా స్పందన లేదు. అంటే దీన్ని ఇంకా వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్ధంగానే చూడాల్సి వస్తోంది. ఈ దశలో.. మూడు రాజధానుల ఉద్యమం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే వ్యవహారం కేవలం వైసీపీ పోరాటం మాత్రమే కాదని, జనం ఆరాటం కూడా అని తెలియజేసేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈనెల 25న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ దీన్ని లీడ్ చేసినా, ఇతర అన్ని పార్టీల నాయకులు, విద్యావేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా అందరి భాగస్వామ్యం కోరుతున్నారు.

అందరి ఆకాంక్ష ఇది..

విశాఖకు రాజధాని రావాలనే ఆశ, ఆలోచన, కేవలం వైసీపీ నేతలది మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర బాగుండాలంటే విశాఖకు పరిపాలనా రాజధాని రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలియజేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ నుంచి అమరావతి యాత్రకు గట్టి హెచ్చరిక చేయాలని చూస్తున్నారు. అమరావతి యాత్ర ఉత్తరాంధ్రకు రాకూడదని, వెనుతిరిగి వెళ్లిపోవాలనేది వీరి డిమాండ్. మరి ఈ సమావేశానికి వైసీపీ ఆశించినట్టుగానే అన్ని వర్గాల మద్దతు ఉంటుందా.. లేక కేవలం వైసీపీ సానుభూతి పరులే హాజరవుతారా అనేది వేచి చూడాలి.

మరోవైపు బీజేపీ నేతలు అమరావతి యాత్ర విషయంలో కాస్త ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టీడీపీని పక్కకు నెట్టి అమరావతి ఉద్యమాన్ని వారు భుజానికెత్తుకోవాలనుకుంటున్నారు. గతంలో అమిత్ షా వార్నింగ్ తో న్యాయస్థానం టు దేవస్థానం యాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా వారు అమరావతి రైతుల ఉత్తరాంధ్ర యాత్రకు రక్షణ కవచంలా ఉంటామని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో వారి యాత్రకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూస్తామంటున్నారు. యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించక ముందే మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రవేశించిన తర్వాత అది చేతల వరకు వెళ్తుందేమోనన్న భయం అందరిలో ఉంది.

Tags:    
Advertisement

Similar News