పోటీ నుంచి తప్పుకోవడమంటే.. జెండా పీకేయడమే
టీడీపీ అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణలో పోటీ నుంచి టీడీపీ తప్పుకుందంటూ ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసినట్టేనని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పూర్తిగా తప్పుకోవడం అంటే అక్కడ ఆ పార్టీ జెండా పీకేయడమేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే మీడియా దీనిని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో క్లారిటీ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణలో పోటీ నుంచి టీడీపీ తప్పుకుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో కూడా మిత్రపక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపీ 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదని విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు.
పురందేశ్వరిది ‘సెలెక్టివ్ అటెన్షన్’
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. పురందేశ్వరి ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ భ్రాంతిలో ఉన్నవారు తనకు కావాల్సిన వాటినే నమ్ముతారని, వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరని ఆయన చెప్పారు. దృష్టంతా ’బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే పచ్చ పార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ’సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమేనని విజయసాయిరెడ్డి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.