కొడాలి.. వాడో ఏడు తప్పిన వెధవ- వైసీపీ వెంకట్రావ్ వీడియో వైరల్
ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నానిని కూడా తిట్టేశారు. '' ఆ కొడాలి నాని ఏడో తరగతి తప్పిన వెధవ'' అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ తిట్టారు.
పాలన పరంగా జగన్‌కు మంచి మార్కులే ఉన్నా పార్టీ వ్యవహారాలపై మాత్రం ఆయన పట్టు సడిలినట్టుగా ఉంది. ఇంతకంటే పోయేది ఏముందిలే.. అన్న ధోరణిలోకి చాలా మంది వైసీపీ నేతలు వచ్చేస్తున్నారు. పైకి మౌనంగా ఉంటున్న లోలోన రగిలిపోతున్న నేతలు చాలా మందే ఉన్నారు. ఆ ఫైర్ ప్రైవేట్ సంభాషణల్లో బయటకు వస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గుంటూరు జిల్లా వైకుంఠపురంలో వ్యాసమహర్షి ధ్యానమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీరిద్దరు హాజరయ్యారు. అక్కడే కొందరితో చిట్‌చాట్ చేశారు. ఆ మాటలను ఎవరో రహస్యంగా సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇప్పటి వరకు వల్లభనేని వంశీనే వీరు తిట్టేవారు. ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నానిని కూడా తిట్టేశారు. '' ఆ కొడాలి నాని ఏడో తరగతి తప్పిన వెధవ'' అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ తిట్టారు. '' కొడాలి నాని ఎంతసేపూ సినిమా గురించి మాట్లాడుతుంటాడు. సినిమాల్లో ఏమవుతుంది .. ఆఖరి వరకు హీరో రకరకాలుగా ఇబ్బందిపడుతాడు. ఆఖరిలో హీరో చేతిలో చెంపదెబ్బ తినడం ఖాయం'' అంటూ కొన్ని బూతులు కలిపి మాట్లాడారు. ''అసలు వాడి వల్ల నియోజకవర్గానికి ఏం ఉపయోగం. కొడాలి, వంశీ ఏం వ్యాపారం చేసి ఇంత డబ్బులు సంపాదించారు?'' అంటూ యార్లగడ్డ ప్రశ్నించారు.
దుట్టా రామచంద్రారావు '' మేం ఎమ్మెల్యే ఆగడాలను ఎదురించబట్టే.. ప్రజలు ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని గుర్తుపడుతున్నారు. ఎమ్మెల్యేకు గుర్తింపు ఉన్నా లేకున్నా మాకు ఉంది'' అంటూ తీవ్రపదజాలంలో మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించేందుకు యార్లగడ్డ వెంకట్రావ్ నిరాకరించారు. దుట్టా మాత్రం అవును స్నేహితులతో కలిసి చేసిన ప్రైవేట్ సంభాషణల్లో ఏవో మాట్లాడుకున్నాం అంటూ లైట్ తీసుకున్నారు.