పురందేశ్వ‌రీ.. నీలా అదృష్టం అంద‌రికీ క‌లిసిరాదులే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన కులగణనకు పురందేశ్వరి అనుకూలమా.. వ్యతిరేకమా.. అనే విషయం స్పష్టం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement
Update:2023-11-18 09:36 IST

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కలిసొచ్చినట్టుగా అదృష్టం అందరికీ కలిసిరాదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖపట్నం స్థానం నుంచి పోటీ చేశారని, ఆ ఎన్నికల్లో 20 పోలింగ్‌ కేంద్రాల్లో ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదని తెలిపారు. మరో 40 పోలింగ్‌ కేంద్రాల్లో అయితే 10 లోపు ఓట్లు మాత్రమే పడ్డాయని చెప్పారు. అయినప్పటికీ ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు అయ్యారని వివరించారు. అందరికీ అటువంటి అదృష్టం కలిసిరాదంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాదు.. కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ, పచ్చ పార్టీకి కాపలా కాయడం పురందేశ్వరికి మాత్రమే చెల్లిందని దుయ్యబట్టారు.

పురందేశ్వరి అనుకూలమా.. వ్యతిరేకమా..?

రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతి, మరింత మెరుగైన సామాజిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన కులగణనకు పురందేశ్వరి అనుకూలమా.. వ్యతిరేకమా.. అనే విషయం స్పష్టం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్న చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు పురందేశ్వరి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు పాలసీనే తన విధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు ఎస్సీ, బీసీ కులాలను కించపరుస్తూ మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని, బీసీలు జడ్జీలుగా పనికిరారని, వారి తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని విజయసాయిరెడ్డి తెలిపారు.

తెలంగాణలో అపవిత్ర పొత్తులకు బరితెగించిన టీడీపీ

తెలంగాణ కాంగ్రెస్‌ ర్యాలీలో పచ్చ కండువాలు స్వైరవిహారం చేస్తున్నాయని, స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ అపవిత్ర పొత్తులకు బరితెగించిందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని టోటల్‌ డ్రామాస్‌ పార్టీ అని ఆయన మండిపడ్డారు. టీడీపీ తోక పార్టీల్లోనూ కుల పెత్తందారీ అహంకారం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంగ్లీష్‌ మీడియం వల్ల ప్రయోజనం లేదని సీపీఎం నేత రాఘవులు చేసిన వ్యాఖ్యలు చూస్తే తోక పార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News