ప్రభుత్వం ప్రజాధనాన్ని వేస్టుచేస్తోందా..?
జీవో.1 అమలుపై హైకోర్టు విచారిస్తున్నప్పుడు మళ్ళీ తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.
సుప్రీం కోర్టులో జీవో నంబర్.1 పై పిటిషన్ వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధానాన్ని వేస్టుచేసిందా..? అంటే అవుననే అంటున్నారు కొందరు లాయర్లు. జీవో-1 అమలును సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈనెల 23వ తేదీన ఈ కేసును విచారించబోతోంది. అంటే ప్రభుత్వానికి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణకు మధ్య వివాదం హైకోర్టులో పూర్తికాలేదు. ప్రభుత్వ ఆదేశాలపై 23వ తేదీవరకు కోర్టు స్టే విధించింది. ఇంతలోనే ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేసింది.
ఇక్కడే ప్రభుత్వం తప్పుచేసిందనే వాదన పెరిగిపోతోంది. ఎలాగంటే ఒక కేసు హైకోర్టు విచారణలో ఉండగా మళ్లీ అదే కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించదు. గతంలో ఇలా వేసిన కేసులను సుప్రీం కోర్టు తిప్పి హైకోర్టుకే పంపించిన ఘటనలు చాలానే ఉన్నాయి. చరిత్రను గుర్తుపెట్టుకోకుండా తాజాగా హైకోర్టు విచారణలో ఉన్న కేసును ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎలా ఛాలెంజ్ చేసిందో ఎవరికీ అర్థం కావటంలేదు. పిటిషన్ దాఖలు చేసినా దాన్ని సుప్రీం కోర్టు విచారించటానికి నిరాకరిస్తుందని ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న న్యాయనిపుణులకు తెలీదా..?
ఇప్పుడు జరిగిందిదే కదా. జీవో.1 అమలుపై హైకోర్టు విచారిస్తున్నప్పుడు మళ్ళీ తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. కేసు విచారణను హైకోర్టులోనే తేల్చుకోమని స్పష్టంగా చెప్పేశారు. ఒకవేళ జీవో.1పై హైకోర్టు ఏదో ఒక తీర్పు చెప్పేస్తే అప్పుడు సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకున్నా అర్థముంటుంది.
ఇప్పుడు ప్రభుత్వం చేసిన పనికారణంగా అనవసరంగా ప్రజాధనం వృథా అయ్యింది. రాష్ట్రప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తున్న లాయర్లు ఎవరు కూడా ఉచితంగా వాదించటంలేదు. కొందరు లాయర్లు వాయిదాకు ఇంతని చార్జి చేస్తుంటే.. మరికొందరు లాయర్లు గంటకింతని చార్జి చేస్తున్నారు. లాయర్లకు ప్రభుత్వం చేస్తున్న పేమెంట్లన్నీ ప్రజాధనమే. ఈ రకంగా చూస్తే గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో కానీ, పంచాయతీ భవనాలకు రంగులు వేసిన విషయంలో ప్రజాధనం వేస్టయినట్లే ఇప్పుడు కూడా వృథా అయ్యింది.