చంద్రబాబు మళ్ళీ అదే తప్పు చేస్తారా?
వైసీపీ నుండి పార్టీలోకి వచ్చే వాళ్ళకి చంద్రబాబు టికెట్లిస్తే తమ్ముళ్ళు ఊరుకుంటారా? టికెట్లు ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా చెప్పారంటేనే వాళ్ళపై నియోజకవర్గాల్లో నెగిటివ్‌గా ఉందనే కదా అర్థం. అలాంటి వాళ్ళని చంద్రబాబు తీసుకుని టికెట్లిస్తే గెలుస్తారా? అసలు తమ్ముళ్ళు, క్యాడర్ సహకరిస్తారా?
చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే మళ్ళీ చేయబోతున్నారా? అచ్చెన్నాయుడు మాటలు విన్న తర్వాత అలాగే అనిపిస్తోంది. ఒకసారి తప్పుచేసి ఘోరంగా దెబ్బతిన్న తర్వాత కూడా గుణపాఠం నేర్చుకున్నట్లు లేరు. ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ నుండి తొందరలోనే చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నట్లు కింజరాపు అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్నారు. మొన్ననే నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో గెలిచారు కదా అందుకనే మంచి ఊపుమీదున్నారు. 40 మంది అని ఒకసారి కాదు 16 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మరోసారి చెబుతున్నారు.
సరే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని పక్కనపెట్టేద్దాం. అచ్చెన్న చెబుతున్నట్లే 40 మంది ఎమ్మెల్యేలు వస్తే టీడీపీలో చేర్చుకుంటారా? రాబోయే ఎన్నికల్లో అందరికీ టికెట్లిస్తారా? ఇక్కడే అసలు సమస్య మొదలవ్వబోతోంది. 2014లో వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. తీసుకునేటప్పుడు అందరికీ టికెట్లు+ఖర్చులు హామీ ఇచ్చినా తర్వాత టికెట్లిచ్చింది 12 మందికే. వీరిలో గెలిచింది గొట్టిపాటి రవికుమార్ మాత్రమే.
వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారనే మంట, చంద్రబాబు పాలనపై పెరిగిపోయిన వ్యతిరేకత, జగన్ పాదయాత్ర అన్నీ కలిపి టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ దెబ్బలో ఫిరాయింపులు కూడా తుడిచిపెట్టుకుపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో చంద్రబాబు పాత రాజకీయాన్నే మళ్ళీ మొదలుపెట్టారు. లాక్కున్న వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వటం పెద్ద సమస్యే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాల్లో టికెట్లు ఖాయమైన తమ్ముళ్ళున్నారు, ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్నవారు ఉన్నారు.
వైసీపీ నుండి పార్టీలోకి వచ్చే వాళ్ళకి చంద్రబాబు టికెట్లిస్తే తమ్ముళ్ళు ఊరుకుంటారా? టికెట్లు ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా చెప్పారంటేనే వాళ్ళపై నియోజకవర్గాల్లో నెగిటివ్‌గా ఉందనే కదా అర్థం. అలాంటి వాళ్ళని చంద్రబాబు తీసుకుని టికెట్లిస్తే గెలుస్తారా? అసలు తమ్ముళ్ళు, క్యాడర్ సహకరిస్తారా? జగన్ వద్దు అనుకున్న వాళ్ళని చంద్రబాబు పార్టీలో చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు అచ్చెన్న మాటల్లో అర్థమవుతోంది. చూస్తుంటే పోయిన ఎన్నికలకు ముందు చేసిన తప్పునే చంద్రబాబు మళ్ళీ చేయబోతున్నట్లున్నారు.