సీపీఎస్ పై తెగేదాకా లాగుతారా..? ఎన్నికల్లో వైసీపీకి నష్టంలేదా..?

ఎన్నికలనాటికి ఉద్యోగులు ఏకతాటిపైకి వస్తే ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రభుత్వంలో కలిసిపోయిన ఆర్టీసీ ఉద్యోగులు.. తమకు అండగా ఉంటారనే ధీమా మాత్రం వైసీపీలో కనిపిస్తోంది.

Advertisement
Update:2022-11-23 07:56 IST

2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ధీమాగా చెప్పిన జగన్, మూడున్నరేళ్లు దాటినా దానిపై నోరు మెదపలేదు. ఎంతసేపూ మంత్రులు, సలహాదారులతో ఉద్యోగుల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారే కానీ, తనకు తానుగా నోరుతెరిచి సీపీఎస్ రద్దు చేయలేం అని ఒప్పుకోలేదు. సాధ్యం కాదు, ప్రత్యామ్నాయం చూస్తాం అని కూడా సర్దిచెప్పలేదు. మూడున్నరేళ్లు గడిచింది, ఉద్యోగులు ఓపిక పట్టారు, ఇప్పటికే పీఆర్సీ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కూడా తమకిచ్చిన మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వంపై మరోసారి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగులు.

రద్దు సంగతి సరే, ప్రభుత్వ వాటా ఏది..?

పాత పెన్షన్ విధానం అమలు సంగతి పక్కనపెడితే, ప్రస్తుతం అమలులో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022 మార్చి నుంచి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ప్రాన్ ఖాతాలో జమ కావడం లేదని.. దీనిపై ప్రభుత్వం ఆదాయపు పన్ను ఎలా చెల్లిస్తుందని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ లో ప్రభుత్వ వాటాను 10నుంచి 14 శాతానికి కేంద్రం పెంచినా, రాష్ట్రంలో అది అమలు కావడంలేదన్నారు. సీపీఎస్ పథకంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, వారిలో కొందరికి 1500 రూపాయల పెన్షన్ వస్తోందని, ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్ కంటే ఇది తక్కువ అని అంటున్నారు ఉద్యోగులు. ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేస్తున్నారని, ఏపీకి వచ్చిన కష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ విధానం ఏంటి..?

సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం కూడా కాస్త గట్టిగానే ఉంది. ఖజానాపై పెనుభారం పడే అవకాశం ఉండటం, ఇప్పటికే సంక్షేమ పథకాలకు బడ్జెట్ సరిపోకపోవడంతో సీపీఎస్ రద్దు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సీఎం జగన్. అయితే ఎన్నికలనాటికి ఉద్యోగులు ఏకతాటిపైకి వస్తే ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రభుత్వంలో కలిసిపోయిన ఆర్టీసీ ఉద్యోగులు.. తమకు అండగా ఉంటారనే ధీమా మాత్రం వైసీపీలో ఉంది. అయితే ఎన్నికలనాటికి సీపీఎస్ విషయంలో వైసీపీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. అది ఉద్యోగులకు అనుకూలమా లేక వ్యతిరేకమా అనేది ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News