టీడీపీ బూతులు.. జనసేన సుతిమెత్తని హెచ్చరికలు
నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేసినా, వార్నింగ్ ఇచ్చినా అదంతా సుతిమెత్తగా జరిగిపోయింది. తిట్లు తిన్న అధికారులెవరూ హర్ట్ కాలేదు. టీడీపీ నేతలకు చిక్కినవారు మాత్రం బూతులకు బలైపోయారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అధికారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి. నిన్నటికి నిన్న అయ్యన్నపాత్రుడు అధికారుల్ని బండబూతులు తిట్టారు, మంత్రి అచ్చెన్నాయుడు.. నా సంగతి మీకు తెలియదంటూ వార్నింగ్ ఇచ్చారు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు వింటే టీడీపీ ఏ స్థాయిలో ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటుందో అర్థమవుతుంది. బీజేపీ నేతలు కూడా ఇలాంటి వార్నింగ్ లకు వెనకాడ్డంలేదు. అయితే జనసేన మాత్రం కాస్తో కూస్తో నిదానంగా వ్యవహరిస్తోంది. కూటమిలో ఒక్కో పార్టీ ఒక్కో స్టైల్ లో అధికారులకు వార్నింగ్ లు ఇవ్వడం విశేషం.
జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే తనిఖీల పేరుతో అధికారుల్ని హడలెత్తిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని, అలసత్వం పేరుకుపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. తూకాల్లో మోసం జరుగుతోందని, సిబ్బంది కూడా పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారాయన. తనిఖీలకు వెళ్లిన ప్రతీ చోటా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఆయన స్టైల్ లో.
తాజాగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్ ను మంత్రి నాదెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరు సరకుల ప్యాకెట్లను పరిశీలిస్తే అందులో ఐదింటిలో సరైన నాణ్యత లేదని, సరైన తూకం కూడా లేదని గుర్తించినట్టు తెలిపారు. గోడౌన్ దగ్గర సరకుల వివరాలు నమోదు చేయలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సరకుల తూకంలో తేడాలున్నా ఎందుకు సరిచూసుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల.
నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేసినా, వార్నింగ్ ఇచ్చినా అదంతా సుతిమెత్తగా జరిగిపోయింది. తిట్లు తిన్న అధికారులెవరూ హర్ట్ కాలేదు. వారి ఇగోలు దెబ్బతినలేదు. అయితే టీడీపీ నేతలకు చిక్కినవారు మాత్రం బూతులకు బలైపోయారు. అందరి ముందు బూతులు తిడుతున్నారని, మానసికంగా వేధిస్తున్నారంటూ కొందరు ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్నింగ్ రాజకీయం ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి.