ప్రైవేటీకరణ చెయ్యట్లేదు.. కేంద్ర మంత్రితో మమ అనిపించారు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని అన్నారు కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని, దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు.

Advertisement
Update:2024-07-11 16:01 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే ప్రశ్నకు తావులేదంటూనే చిన్న మెలిక పెట్టారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్రైవేటీకరణ విషయంలో ప్రధానిదే తుది నిర్ణయం అని చెప్పారు. ప్రధాని ప్రకటనతోనే అది అధికారికం అవుతుందని, ఆయన్ను తాను ఒప్పిస్తానని అన్నారు. అంటే ఉక్కు శాఖ మంత్రిగా అధికారిక ప్రకటన చేయకుండానే ఏపీలోని కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేశారు కుమారస్వామి.


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎన్నికల తర్వాత కూడా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ యూ టర్న్ తీసుకుందని డెక్కన్ క్రానికల్ పత్రిక కథనం కూడా ఇటీవల సంచలనం రేపింది. పత్రిక ఆఫీస్ పై టీడీపీ దాడి మరింత రచ్చగా మారింది. ఈ దశలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖకు రావడం, స్టీల్ ప్లాంట్ ని పరిశీలించడం, అనంతరం మధ్యే మార్గంగా ప్రైవేటీకరణ ఉండదని ప్రకటన చేయడం ఇందులో అప్ డేట్స్.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని అన్నారు కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని, దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్‌ మూతపడుతుందనే ఆందోళన వద్దని క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఇక్కడ ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణ అనే ప్రశ్నకు తావులేదన్న ఆయన 2 నెలలు సమయం ఇస్తే ప్రధానితో కూడా ఆ మాట చెప్పిస్తానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకోలేకపోతోందన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన కాస్త ఊరటనిచ్చేలా ఉన్నా.. మోదీ అధికారిక ప్రకటన వరకు నమ్మలేని పరిస్థితి. ప్రస్తుతానికి టీడీపీకి ఇబ్బందిలేకుండా కేంద్ర మంత్రి ట్విస్ట్ ఇచ్చి వెళ్లారు. 

Tags:    
Advertisement

Similar News