విశాఖలో తగలబడ్డ రైలు బోగీ
రైల్వే సిబ్బంది అప్రమత్తం అయి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బి-6 మొత్తం అగ్నికి ఆహుతి కాగా మిగతా రెండు బోగీలు పాక్షికంగా తగలబడ్డాయి.
విశాఖ రైల్వే స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు వ్యాపించి పూర్తిగా తగలబడిపోయింది. ఒక ఏసీ బోగీ పూర్తిగా కాలిపోగా, మరో రెండు బోగీలు పాక్షికంగా మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రైలు స్టేషన్లో ఆగి ఉంది. ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి రైల్వే సిబ్బంది మంటల్ని అదుపు చేశారు, దీంతో ఇతర బోగీలు స్వల్పంగా కాలిపోయాయి, లేదంటై రేలు మొత్తం తగలబడేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు మరికొన్ని రైళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముందని అన్నారు.
అసలేం జరిగింది..?
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ రైల్వే స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ ఫైమ్ పై ఆగి ఉంది. గమ్యస్థానం విశాఖ కావడంతో ప్రయాణికులంతా అక్కడ దిగేశారు. అయితే హఠాత్తుగా అందులోని బి-7 బోగీలో మంటలు చెలరేగాయి. అవి బి-6, ఎం-1 కి కూడా అంటుకున్నాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తం అయి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బి-6 మొత్తం అగ్నికి ఆహుతి కాగా మిగతా రెండు బోగీలు పాక్షికంగా తగలబడ్డాయి.
బి-7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. ఇటీవల పలు రైళ్లు పట్టాలు తప్పడంతో రైల్వే శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా పట్టాలపై ఆగిఉన్న రైలులో మంటలు చెలరేగడం బోగీ పూర్తిగా కాలి బూడిదగా మారడం సంచలనంగా మారింది. ప్రయాణికులెవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరగడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం.