తమ్ముళ్లు, జనసేనకు ఇబ్బందేనా..?

ఎవరైనా మీ ప్రాంతాన్ని ప్రభుత్వం డెవలప్ చేయాలని అనుకుంటోందని అంటే ఎవరూ కాదనరు కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రత్యేకించి వైజాగ్ వాసుల ఆలోచనల్లోనూ ఇదే కనబడుతోంది.

Advertisement
Update:2022-10-15 15:20 IST

మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా `విశాఖ గ‌ర్జ‌న‌` పేరుతో విశాఖపట్నం రామకృష్ణా బీచ్ రోడ్డులో జరిగిన ర్యాలీ, బహిరంగసభ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. అధికార వికేంద్రీకరణ, మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో భారీర్యాలీ, బహిరంగసభ జరిగింది. నాన్ పొలిటికల్ జేఏసీ అన్నది పేరుకేగానీ మొత్తం వ్యవహారమంతా వైసీపీ ఆధ్వర్యంలోనే జరిగింది. మంత్రులు, నేతల ప్రసంగాలను పక్కన పెట్టేస్తే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌గా ఉండాలనే జనాల బలమైన ఆకాంక్ష బయటపడింది.

ఎవరైనా మీ ప్రాంతాన్ని ప్రభుత్వం డెవలప్ చేయాలని అనుకుంటోందని అంటే ఎవరూ కాదనరు కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రత్యేకించి వైజాగ్ వాసుల ఆలోచనల్లోనూ ఇదే కనబడుతోంది. అధికారపార్టీ నేతలు ఎంత చొరవ తీసుకున్నా జనాల్లో బలమైన కోరిక లేకపోతే ర్యాలీ, బహిరంగసభ సక్సెస్ అయ్యే అవకాశంలేదు. ఒకవైపు వర్షంపడుతున్నా జనాలు బీచ్ రోడ్డులో పొటెత్తారంటేనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలనే కోరిక జనాల్లో ఎంత బ‌లంగా ఉందో బయటపడింది.

సరిగ్గా ఈ పాయింటే టీడీపీ, జనసేనలను బాగా ఇబ్బంది పెట్టటం ఖాయమనే అనిపిస్తోంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించాం కాబట్టి తమకు ఓట్లేయమని వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలు జనాలను అడుగుతారు. తన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే ఇదే ప్రస్తావిస్తారు. మరి టీడీపీ, జనసేన నేతలు ఏమని చెప్పి ఓట్లడుగుతారు..? ఒకవైపు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని ఉత్తరాంధ్రలో డిమాండు చేస్తున్న తమ్ముళ్ల‌కు, జనసేన అభ్యర్థులకు జనాలు ఓట్లేస్తారా ?

ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌గా విశాఖను వ్యతిరేకిస్తున్న మీకు ఎందుకు ఓట్లేయాలని రేపు జనాలు నిలదీస్తే టీడీపీ, జనసేన అభ్యర్థులు, నేతలు జనాలకు ఏమని సమాధానం చెప్పగలరు..? కాలం అనుకూలించి తొందరలోనే జగన్ గనుక విశాఖలో క్యాంప్ ఆఫీసు పెట్టుకుని పరిపాలన మొదలుపెట్టేస్తే ప్రతిపక్షాలకు మరిన్ని ఇబ్బందులు తప్పేట్లు లేవు. జనాల్లో గనుక మూడురాజధానుల కోరిక బలంగా ఉంటే టీడీపీకి ఇప్పుడున్న సీట్లు వచ్చేది కూడా అనుమానమేనా ?

Tags:    
Advertisement

Similar News