పెన్షన్ల పంపిణీ.. ఉద్యోగులకు భారమా..? బాధ్యతా..?

పెన్షన్ల పంపిణీ ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది కాబట్టి.. సచివాలయ ఉద్యోగులపై ఆ భారం కూడా కేవలం రెండు రోజులకు పరిమితం అని చెప్పుకోవాలి.

Advertisement
Update: 2024-06-28 06:08 GMT

జులై-1నుంచి ఇంటివద్దకే పెన్షన్ పంపిణీ మళ్లీ మొదలవుతోంది. అయితే ఈసారి వాలంటీర్లు ఇవ్వడంలేదు, ఆ స్థానంలో సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అధికారికంగా ఒక్కో గ్రామ సచివాలయంలో 12మంది ఉద్యోగులు ఉంటారు. వీరిలో ప్రతి ఒక్కరికీ పెన్షన్ల పంపిణీకి 50 ఇళ్లు కేటాయించారు. గతంలో వాలంటీర్లకు కూడా ఇలాగే 50 ఇళ్లు ఉండేవి. అయితే కొత్త ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయిస్తామంటోంది. దీనిపై వైసీపీ అనుకూల మీడియా సెటైర్లు వేస్తోంది. ఉద్యోగాలిచ్చిన జగన్ ని కాదనుకున్నందుకు సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని అంటోంది. ఇంతకీ పెన్షన్లు ఇవ్వడం సచివాలయ ఉద్యోగులకు భారమా..? అది వారి బాధ్యతా..?

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ వంటి ఒకటి రెండు పోస్ట్ లు మినహా మిగతా ఉద్యోగులకు కనీసం నెలలో 10రోజులు కూడా పూర్తి స్థాయిలో పని ఉండదు. మహిళా పోలీస్ లకు సరైన జాబ్ చార్ట్ కూడా లేకపోవడం విశేషం. ఆ ఉద్యోగులంతా సరైన పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారనే అపవాదులున్నాయి. సచివాలయాల వల్ల ప్రజలకు జరిగిన మేలుకంటే, దానికోసం ఖర్చు చేసిన, చేస్తున్న సొమ్ము చాలా ఎక్కువ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారాక మెల్లగా వారికి పని భారం పెరుగుతున్నట్టు చెప్పుకోవాలి. అయితే పెన్షన్ల పంపిణీ ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది కాబట్టి.. ఆ భారం కూడా కేవలం రెండు రోజులకు పరిమితం అని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ వాలంటీర్ల పని కూడా సచివాలయ ఉద్యోగులే పూర్తి చేస్తారన్నమాట.

సచివాలయాలను సృష్టించి ఉద్యోగాలిచ్చామని చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెల్లగా వారికి పనులు చెప్పడం అలవాటు చేస్తోంది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగవుతుందా, లేక 10వేల రూపాయల పారితోషికంతో అది ఇంకా మిగిలే ఉంటుందా అనేది అనుమానమే. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కనపెడితే మాత్రం చంద్రబాబు ఎన్నికల హామీని విస్మరించినట్టే అనుకోవాలి. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వినపడుతోంది. వాలంటీర్ ఉద్యోగమే కావాలని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా..? ప్రత్యామ్నాయ అవకాశాల కోసం వారు ఎదురు చూడటం లేదా..? నెలకి రూ.10వేలు పారితోషికం తీసుకుని రెండు రోజులు పెన్షన్ పంపిణీ చేసి మిగతా రోజులు రెస్ట్ తీసుకోవాలని వాలంటీర్లు అనుకుంటున్నారా..? వీటన్నిటికీ సమాధానం దొరకాల్సి ఉంది. ఇక్కడ పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగు.. ప్రశంసలు అందుకుంటుందో లేక కొత్త విమర్శలకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News