జగన్ కి మరో తలనొప్పి.. ఆ లిస్ట్ లో విజయవాడ సెంట్రల్
ఒక్కో నియోజకవర్గంపై ఇద్దరు నేతలు ఆశలు పెట్టుకోవడం, పెత్తనం చెలాయించాలని ఆరాటపడటంతో అసలు సమస్యలు మొదలవుతున్నాయి.
ప్రజలంతా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారు, ఎన్నికల్లో వైసీపీకే విజయం కట్టబెడతారనేది సీఎం జగన్ ధీమా. ప్రజలు సంతృప్తిగా ఉన్నా, కొన్ని చోట్ల నాయకుల్లో మాత్రం అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి సరిగ్గా ఎన్నికలు దగ్గరపడే సమయంలో బయటపడుతోంది. ఒక్కో నియోజకవర్గంపై ఇద్దరు నేతలు ఆశలు పెట్టుకోవడం, పెత్తనం చెలాయించాలని ఆరాటపడటంతో అసలు సమస్యలు మొదలవుతున్నాయి.
నిన్న మైలవరం, నేడు విజయవాడ..
మైలవరం నియోజకవర్గంలో జిల్లా మంత్రి జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ గొడవ ఇటీవలే సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు చేరింది, ఆయన సర్దుబాటు చేసి ఇద్దరు నేతల్ని పంపించేశారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిప్పురాజుకుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
శిలాఫలకాల్లో ప్రొటోకాల్ మాయం..
అభివృద్ధి పథకాల శిలాఫలకాల్లో ప్రతిపక్ష నేతల పేర్లు ఎలాగూ ఉండవు, కాని అక్కడ అధికార పార్టీ నేతలే ఒకరిపేరు ఉంటే ఇంకొకరు ఉడుక్కుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో స్థానిక ఎమ్మెల్సీ రుహుల్లా పేరు లేకుండా జాగ్రత్తపడుతున్నారట ఎమ్మెల్యే మల్లాది విష్ణు. దీంతో రుహుల్లా నొచ్చుకుంటున్నారు. ఆయన సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. కార్పొరేటర్లలో కూడా ఓ వర్గం రుహుల్లాకు మద్దతు తెలుపుతోందని, వారంతా ఆయనతోనే సమావేశమవుతున్నారని సమాచారం.
రుహుల్లా తల్లి కరిమున్నీసా మరణించడంతో ఆ స్థానం రుహుల్లాకి ఇచ్చారు జగన్. అప్పటినుంచి మల్లాది-రుహుల్లా వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ప్రొటోకాల్ విషయంలో మొదలైన రగడ, ఎన్నికలనాటికి ఏ మలుపు తిరుగుతుందోననే భయం అందరిలో ఉంది. అంతిమంగా అది పార్టీకి నష్టం చేకూరుస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి.
విజయవాడలో ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ గెలుచుకున్నా, ఎంపీ స్థానం మాత్రం టీడీపీదే. అక్కడ టీడీపీని అంత తక్కువగా తీసిపారేయలేం. అందులోనూ మూడు రాజధానుల విషయంలో విజయవాడ ప్రజల్లో కాస్తో కూస్తో అసంతృప్తి ఉండే ఉంటుంది. ఈ నేపథ్యంలో నేతలు ఇలా కొట్టుకుంటుంటే, ఇక ఓట్లు ఎలా పడతాయనే ఆందోళన మొదలవుతోంది. అధిష్టానం ఇప్పటికే ఈ గొడవపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే మైలవరం లాగా ఇక్కడ నేతలు బయటపడలేదు. ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలకు దిగలేదు. ఆరోపణలు వినిపిస్తున్నా అవి కార్పొరేటర్ల స్థాయిలోనే ఉన్నాయి. ఎమ్మెల్యే విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా నేరుగా గొడవ పడలేదు. నివురుగప్పిన నిప్పులా ఉన్న విజయవాడ సెంట్రల్ వైసీపీ రాజకీయం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.