శ్వేత పత్రాలతో హింటిచ్చేశారు -విజయసాయి
శ్వేత పత్రాల్లో విషయమేమీ లేదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. హామీలు అమలు చేయకుండా తప్పించుకోడానికి టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబుకి దారుణమైన ట్రాక్ రికార్డ్ ఉందనేది వైసీపీ వాదన. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం అనేది చంద్రబాబు చరిత్రలోనే లేదని విమర్శిస్తుంటారు ఆ పార్టీ నేతలు. హామీలు అమలు చేయడం ఇష్టం లేకే, సూపర్ సిక్స్ పథకాల కోసం బడ్జెట్ కేటాయించలేని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్లారని వైసీపీ అధినేత జగన్ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్వేత పత్రాలతో సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చినట్టుందని ఎద్దేవా చేశారు విజయసాయి.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న శ్వేత పత్రాల్లో విషయమేమీ లేదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. హామీలు అమలు చేయకుండా తప్పించుకోడానికి టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాలను తెరపైకి తెస్తోందని అన్నారాయన. అందుకే శ్వేతపత్రాల పేరుతో సీఎం చంద్రబాబు సాకులు వెదుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు హామీలపై నిలదీస్తే.. శ్వేత పత్రాలు చూపెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సవాళ్లను స్వీకరించేందుకు చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగా ఉండరని, అందుకే ఆయన ఎన్నికల్లో మిత్రులపై ఆధారపడుతుంటారని అన్నారు విజయసాయిరెడ్డి.
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం శ్వేత పత్రాలు హాట్ టాపిక్ గా మారాయి. గత ప్రభుత్వ వైఫల్యాల పేరుతో తాజా ప్రభుత్వం వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. గతంలో జరిగిన తప్పొప్పులు ఇవేనంటూ ప్రజల ముందు పెడుతోంది. వీటిపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారాయన. సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న దశలో.. తమపై నిందలు వేసేందుకు సీఎం చంద్రబాబు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారని అన్నారు జగన్.