టీటీడీ దర్శన టికెట్లు బ్లాక్‌లో విక్రయించిన టీచర్స్ ఎమ్మెల్సీ.. అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు
ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డులను ఉపయోగించి ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దర్శనాలకు తీసుకెళ్తున్నారని నిర్ధారించుకొని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (యూటీఎఫ్) షేక్ షాబ్జీని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్శనాల పేరుతో భక్తుల నుంచి నగదు తీసుకొని.. వారికి టికెట్లు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తుల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి.. ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్న అధికారులు.. గురువారం ఎమ్మెల్సీ షేక్ షాబ్జీని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దగ్గర నుంచి చూడటానికి వీఐపీ బ్రేక్ దర్శనం వీలుగా ఉంటుంది. అందుకే ఈ వీఐపీ బ్రేక్ దర్శనానికి చాలా డిమాండ్ ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకొని వచ్చి వీఐపీ దర్శనం టికెట్లు పొందుతుంటారు. అసలైతే ఈ టికెట్ ధర రూ.500 మాత్రమే అయినా.. టీటీడీ ఎక్కువగా కేటాయించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోటా ప్రకారం కేటాయిస్తారు. ఎవరైనా ప్రజాప్రతినిధి స్వయంగా దర్శనానికి వెళ్తే.. తమతో పాటు వచ్చిన వారిలో 12 మందిని వీఐపీ బ్రేక్ దర్శనానికి తీసుకొని వెళ్లవచ్చు.
ఈ నిబంధనలు ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. బ్లాక్‌లో అయితే దళారులు ఈ టికెట్లను రూ.10 వేల వరకు విక్రయిస్తుంటారు. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎల్1, ఎల్2, ఎల్3 అంటూ పలు కేటగిరీలు ఉండేవి. కానీ ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనం మాత్రమే ఉంది. దీంతో ఎమ్మెల్సీ షాబ్జీ పలు మార్లు తిరుమల వచ్చి.. చాలా మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కలిగించారు. అంతే కాకుండా.. ఒక్క నెలలోనే 19 సిఫార్సు లెటర్లు జారీ చేయడంతో విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది.
షేక్ షాబ్జీ నుంచి వచ్చే సిఫార్సు లేఖలు, వీఐపీ దర్శనం టికెట్ల రిక్వెస్టులను పరిశీలించారు. గురువారం తిరుమలకు మరోసారి వచ్చిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ 14 మందికి ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాలని ఈవో కార్యాలయంలో లేఖ ఇచ్చారు. ఇందులో 10 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం.. మిగిలిన నలుగురికి సాధారణ దర్శనం టికెట్లు ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ వెంట వచ్చిన 10 మందిలో ఆరుగురి ఐడీ ఫ్రూఫ్‌లు చెక్ చేయగా ఫోర్జరీ అని తెలిసింది.
ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డులను ఉపయోగించి ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దర్శనాలకు తీసుకెళ్తున్నారని నిర్ధారించుకొని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీలో ఇచ్చిన ఆధార్ కార్డుపై హైదరాబాద్ అడ్రస్ ఉండగా.. అసలు అడ్రస్ కర్ణాటకగా తేలింది. ఈ ఆరుగురి దర్శనం కోసం రూ.1.05 లక్షలు ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ఖాతాకు భక్తులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు కూడా గుర్తించారు. శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులను మోసం చేస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అధికారులు చెప్పారు. దళారులకు సిఫార్సు లేఖలు జారీ చేస్తున్న మరో 16 మంది ప్రజా ప్రతినిధుల సమాచారం కూడా సేకరించామని.. త్వరలోనే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.