లోకేష్ యాత్రలో వంగవీటి రాధా.. క్లారిటీ ఇచ్చినట్టేనా..?
సడన్ గా రాధా.. లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కలసి నడిచారు. హుషారుగా కనిపించారు, లోకేష్ తో రాధా సరదాగా మాట్లాడుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వంగవీటి రాధా అప్పుడప్పుడు జనసేన నాయకులతో కలిసి కనిపిస్తారు, వైసీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆయనతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. కానీ టెక్నికల్ గా రాధా మాత్రం టీడీపీలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయన ఏ గట్టున ఉంటారనేది ఇప్పటి వరకూ సస్పెన్స్ గానే మిగిలింది. మరిప్పుడు ఏమైందో తెలియదు కానీ సడన్ గా రాధా.. లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కలసి నడిచారు. హుషారుగా కనిపించారు, లోకేష్ తో రాధా సరదాగా మాట్లాడుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వంగవీటి రాధా, పోటీ చేయకుండా కేవలం ప్రచారంలోనే పాల్గొన్నారు. టీడీపీ ఓడిపోవడంతో కొన్నాళ్లుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. అదే సమయంలో ఆయన వైసీపీ నాయకులతో టచ్ లో ఉండటం కూడా అనుమానాలకు తావిచ్చింది. రాధా వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఓ దశలో ఆయన జనసేనలో కూడా చేరతారని అన్నారు. కానీ ఇప్పుడాయన జనాలకు క్లారిటీ ఇచ్చారు. తానింకా టీడీపీలోనే ఉన్నట్టు, ఉండబోతున్నట్టు సిగ్నల్స్ ఇచ్చేశారు.
పీలేరు నియోజకవర్గంలోని కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించగా.. ఆయన వెంట వంగవీటి రాధా కూడా యాత్రలో పాల్గొన్నారు. ఏదో మొహమాటానికి కాకుండా లోకేష్ తో కలసి ఫుల్ జోష్ తో ఆయన కనిపించారు. దీంచో ఆయన పార్టీ మార్పుపై వస్తున్నవన్నీ ఊహాగానాలుగానే కొట్టిపారేస్తున్నారు టీడీపీ నేతలు. అటు వైసీపీనుంచి మాత్రం కౌంటర్లు పడుతున్నాయి. రాధా, టీడీపీలోనే ఉండాలనుకోవడం, అందులోనూ లోకేష్ తో కలసి పాదయాత్రలో పాల్గొనడం వంగవీటి అభిమానులకు ఏమాత్రం నచ్చడంలేదని అంటున్నారు.