స్కిల్ స్కాం కేసులోకి ఉండవల్లి ఎంట్రీ.. – సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్
స్కిల్ స్కామ్ కేసులోకి సడెన్‌గా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చారు. స్వతహాగా లాయర్ కూడా అయిన ఉండవల్లి.. ఆర్థిక వ్యవహారాలపైనా సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తిగా జనంలో గుర్తింపు ఉంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడని, ఆయనపై బలమైన ఆధారాలు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అంటుండగా, బాబు నిప్పులాంటివాడని, ఆయన్ని అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై చంద్రబాబుకు సానుభూతి దక్కేలా చేయాలని టీడీపీ, ఎల్లో మీడియా శతవిధాలుగా ప్రయత్నిస్తున్న విషయం కూడా తెలిసిందే.
ఈ క్రమంలో స్కిల్ స్కామ్ కేసులోకి సడెన్‌గా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చారు. స్వతహాగా లాయర్ కూడా అయిన ఉండవల్లి.. ఆర్థిక వ్యవహారాలపైనా సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తిగా జనంలో గుర్తింపు ఉంది. ఇప్పటికే రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్స్‌లో అక్రమాలపై ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఐడీ దర్యాప్తు చేస్తున్న స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందంటున్న నేపథ్యంలో ఇది హై ప్రొఫైల్ కేసు అని ఆయన చెబుతున్నారు. ఈ కేసును సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. అనేక అంశాలతో సంక్లిష్టంగా ఉన్న ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కి ఇంకా నంబర్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడు సహా 44 మందిని చేర్చడం గమనార్హం.
స్కిల్ స్కాం కేసులో ఉండవల్లి ఎంట్రీ ఇవ్వడం చూసి.. జనం ఈ కేసులో ఏదో విషయం ఉండే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో జనంలో ఈ అభిప్రాయం బలపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ పిటిషన్‌పై స్పందించి.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే మాత్రం చంద్రబాబుకు పూర్తిస్థాయిలో కష్టాలు వచ్చినట్టేనని భావిస్తున్నారు.