ఆ జర్నీ.. ఇక నాలుగు గంటలే..! - వందే భారత్ రైలుతో తగ్గనున్న వైజాగ్ టు విజయవాడ ప్రయాణ సమయం
Vande Bharat Train Vijayawada to Vizag: బుల్లెట్ స్పీడుతో దూసుకెళుతూ.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్న ఈ రైలును వైజాగ్ - విజయవాడ మధ్య డిసెంబర్‌లో ప్రారంభించి ట్రయల్ రన్ వేసేందుకు రైల్వే శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇప్పటి వరకు వైజాగ్ టు విజయవాడ రైలు ప్రయాణ సమయం ఆరు గంటలు పడుతుండగా, ఇప్పుడది గణనీయంగా తగ్గనుంది. అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ రైలుతో ఈ ప్రయాణ సమయం నాలుగు గంటలకు చేరనుంది. బుల్లెట్ స్పీడుతో దూసుకెళుతూ.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్న ఈ రైలును వైజాగ్ - విజయవాడ మధ్య డిసెంబర్‌లో ప్రారంభించి ట్రయల్ రన్ వేసేందుకు రైల్వే శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణ సమయాన్ని రెండు గంటల మేరకు తగ్గించేలా ట్రాక్ పరిశీలనలో వాల్తేరు డివిజన్ అధికారులు నిమగ్నమయ్యారు.
డబుల్ స్పీడుతో...
వందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కిలోమీటర్లు. ప్రస్తుత ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే. అంటే.. ప్రస్తుత రైళ్ల ప్రయాణ వేగం కంటే రెట్టింపు వేగంతో వందే భారత్ రైలు దూసుకుపోనుంది. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌కి 4 లైట్లు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఈ లైట్లు ఉపయోగపడతాయి. కోచ్‌లకు బయటి వైపు నుంచి 4 కెమెరాలు ఉంటాయి. వెనుక వైపు నుంచి మరోటి ఉంటుంది. ఎమర్జెన్సీ డోర్లు ప్రతి కోచ్‌కీ నాలుగు ఉంటాయి. అన్ని కోచ్‌లలో ఏసీ సదుపాయం ఉంటుంది. ప్రతి కోచ్‌లో 32 ఇంచ్‌ల స్క్రీన్‌తో ప్రయాణికుల సమాచారం వ్యవస్థ ఉంటుంది.
అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేస్తాయి. ఇందులో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లతో పోల్చితే విజయవాడకు ధరలు.. చైర్‌కార్‌లో రూ.850, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రూ.1600 నుంచి రూ.1650 వరకు ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.