తిరుమల నడక మార్గాల్లో త్వరలో ఆంక్షలు..

అటవీ ప్రాంతంలో జంతువుల సంచారానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రెండు నడక మార్గాల్లో కంచె ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అదే సమయంలో నడక మార్గంలో భక్తుల అనుమతికి సమయం నిర్దేశిస్తామని చెప్పారు.

Advertisement
Update:2023-06-23 11:02 IST

అలిపిరి నడక మార్గంలో చిరుతపులి దాడిలో బాలుడు కౌశిక్ గాయపడిన ఘటన సంచలనంగా మారింది. అయితే బాలుడి ప్రాణాలకు ప్రమాదం లేదని నిర్థారించారు వైద్యులు. టీటీడీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స జరుగుతోంది. బాలుడిని టీటీడీ ఈవో, చైర్మన్ పరామర్శించారు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మరో మూడు నాలుగు రోజుల్లో బాలుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అదే సమయంలో తిరుమల నడకమార్గం విషయంలో ఆంక్షలు తెచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది.

తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు రెండు నడక మార్గాలున్నాయి. శ్రీవారి మెట్టు వద్ద ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులను మెట్లమార్గం వైపు రానివ్వరు. అలిపిరిలో కూడ గతంలో నిబంధనలు ఉన్నా కొవిడ్ తర్వాత వాటిని సడలించారు. రాత్ర వేళల్లో కూడా భక్తులను నడక మార్గంలోకి అనుమతిస్తున్నారు. అయితే గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. కానీ గత రాత్రి జరిగిన ప్రమాదం విషయంలో మరోసారి ఆంక్షలు తెరపైకి రాబోతున్నాయి.

రాత్రి 9 గంటల సమయంలో అలిపిరి నడక మార్గంలో చిరుతపులి దాడి జరిగింది. అంటే రాత్రి 9 కంటే ముందే అక్కడ క్రూరమృగాల సంచారం మొదలవుతుందని తేలిపోయింది. రాత్రి వేళ జంతువులు రోడ్డుపైకి వస్తుంటాయి కాబట్టి వాహనాలకు కూడా ఘాట్ రోడ్లలో అనుమతి లేదు. అదే సమయంలో మెట్ల మార్గంలో కూడా అనుమతి వేళలు మార్చే అవకాశముంది.

ఫెన్సింగ్ కోసం ఏర్పాట్లు..

తిరుమలలో ఇలాంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అటవీ ప్రాంతంలో జంతువుల సంచారానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రెండు నడక మార్గాల్లో అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు కంచె ఏర్పాటు చేస్తామన్నారు. అదే సమయంలో నడక మార్గంలో భక్తుల అనుమతికి సమయం నిర్దేశిస్తామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News