సర్వేలన్నీ జగన్ కే అనుకూలం.. బాబు, పవన్ పరిస్థితి ఏంటి..?

టైమ్స్ నౌ నవభారత్ దేశవ్యాప్తంగా లోక్ సభ సీట్ల విషయంలో సర్వే చేపట్టింది. ఏపీకి సంబంధించి 25 లోక్ సభ స్థానాల్లో 24 లేదా మొత్తం సీట్లు వైసీపీకే దఖలుపడతాయని ఆ సంస్థ తేల్చింది.

Advertisement
Update:2023-07-01 18:43 IST

సర్వేలన్నీ జగన్ కే అనుకూలం.. బాబు, పవన్ పరిస్థితి ఏంటి..?

ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఓటర్లు ఎవరికి అనుకూలం అనేదానిపై నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. నవరత్నాలు అమలు చేశాం, ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టాం, ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకంలో లబ్ధి చేకూర్చాం.. ఓట్లన్నీ మావేనంటోంది వైసీపీ. పాలన అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రం రౌడీరాజ్యంగా మారింది, ఇక సహించలేం, భరించలేమంటూ ఓటర్లు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని చెప్పుకుంటారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. మరి అసలు ఓటర్ల నాడి ఎలా ఉంది. తాజాగా టైమ్స్ నౌ నవభారత్ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో ఏపీలో ఓటర్లు వైసీపీకే పట్టం కడతారని తేలింది.

టైమ్స్ నౌ నవభారత్ దేశవ్యాప్తంగా లోక్ సభ సీట్ల విషయంలో సర్వే చేపట్టింది. ఏపీకి సంబంధించి 25 లోక్ సభ స్థానాల్లో 24 లేదా మొత్తం సీట్లు వైసీపీకే దఖలుపడతాయని ఆ సంస్థ తేల్చింది.


ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పింది. 24 లేదా 25 లోక్ సభ సీట్లు వైసీపీకే దక్కితే.. అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా ఆ పార్టీకి తిరుగుండదనే చెప్పాలి. అంటే వైనాట్ 175 అనే జగన్ లెక్కకు ఈ సర్వే బాగా దగ్గరగా ఉంది.


2019లో జరిగిన ఎన్నికల నాటికి ఏపీ ప్రజలు టీడీపీతో బాగా విసిగిపోయి ఉన్నారు. చంద్రబాబు ఏం చేశారు అనేదానికంటే ఏం చేయలేదు అనేదే ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉంది. రైతు రుణమాఫీ అత్యంత దారుణమైన మోసం, నిరుద్యోగ భృతి ఎన్నికల టైమ్ లో తెరపైకి వచ్చింది.


పోలవరం పూర్తి కాలేదు, ఇతర ప్రాజెక్ట్ లకు నిధులు లేవు, ప్రత్యేక హోదా విషయంలో నాలిక మడతపెట్టడంతో మొదటికే మోసం వచ్చి టీడీపీ దారుణంగా ఓడిపోయింది. 2024 నాటికి టీడీపీపై కోపం పెరగాల్సిన అవసరం లేదు కానీ కొన్ని విషయాల్లో సింపతీ మాత్రం అలాగే ఉంది. పోలవరంలో విషయంలో వైసీపీ కూడా డెడ్ లైన్లు పెట్టింది కానీ పని పూర్తి కాలేదు. ప్రత్యేక హోదా అనే విషయం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మెడలు వంచేస్తాం అనే పెద్ద పెద్ద మాటలు వైసీపీ నాయకులకే చెల్లాయి.


నవరత్నాల విషయంలో ఎలాంటి వంక పెట్టలేం కానీ, సంపూర్ణ మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు వంటివి పంటికింద రాళ్లలా తగులుతున్నాయి. రాజధాని అమరావతి అంశంలో టీడీపీకి మైనస్ మార్కులు పడినా, వైసీపీ దాన్ని అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైంది.

ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అనుకోవచ్చు కానీ మరీ 25కి 25 సీట్లు గెలిచేంతగా వైసీపీ ఎంపీలు ఢిల్లీలో పొడిచేసిందేమీ లేదు. సర్వేలతో చంకలు గుద్దుకోకుండా.. టీడీపీ, జనసేనను మరీ అంత తక్కువగా అంచనా వేయకుండా జగన్ జనాల్లోకి వెళ్తే వరుసగా రెండోసారి అధికారం చేపట్టే అవకాశముంది. అతి విశ్వాసంతో అడుగులేస్తే మాత్రం అది మొదటికే మోసం. 

Tags:    
Advertisement

Similar News