పవన్ కల్యాణ్ సాకు వెనక అసలు కథ ఇదీ..
పవన్ కల్యాణ్ ఏదో ఒక సాకుతో పర్యటనను వాయిదా వేసుకోవాలని అనుకోవడం వల్లనే జనసేన నాయకులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోలేదనే ప్రచారం జరుగుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భీమవరం పర్యటన వాయిదాకు సాకు చెప్పడం వెనక కథ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. భీమవరం పర్యటనకు ఆయన హెలికాప్టర్‌ను వాడాలని అనుకున్నారు. అనువుగా లేని హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసుకోవడంపై అధికారులు అభ్యంతరం చెప్పారు. అయితే, జనసేన దాన్ని మరో రకంగా ప్రచారం చేస్తోంది. ఆర్ అండ్ బీ అధికారులు పవన్ కల్యాణ్ పర్యటనను కావాలని అడ్డుకున్నట్లు తప్పుడు ప్రచారానికి దిగింది.
విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలిప్యాడ్‌కు 2018 నుంచి అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. హెలిప్యాడ్ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోనే అపార్ట్‌మెంట్లు, చెట్లు ఉన్నాయని, ఆ ప్రాంతంలో హెలికాప్టర్ దిగడానికి వీలుకాదని, ఏవియేషన్స్ నిబంధనలను పాటించాలని తాము జనసేన నేతలకు సూచించినట్లు సంబంధిత అధికారులు వివరించారు. అనువైన చోటును హెలిప్యాడ్ కోసం ఎంపిక చేసుకోవాలని సూచించామని ఆర్ అండ్ బీ అధికారులు చెప్పారు. అయితే, అధికారుల మాటను జనసేన నేతలు ఎందుకు పెడచెవిన పెట్టారనేది ప్రశ్న. పవన్ కల్యాణ్ నిజంగానే భీమవరంలో పర్యటన చేయాలని అనుకుంటే రోడ్డు మార్గంలోనైనా వెళ్లి ఉండేవారని అంటున్నారు.
పవన్ కల్యాణ్ ఏదో ఒక సాకుతో పర్యటనను వాయిదా వేసుకోవాలని అనుకోవడం వల్లనే జనసేన నాయకులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. పొత్తులపై ఇంకా స్పష్టత రానందువల్లనే పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెప్పుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం హస్తిన వెళ్లి వచ్చిన చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ, ఆ పరిణామాలపై పెదవి విప్పడం లేదు. సీట్ల సర్దుబాటుపై జరగాల్సిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య భేటీ కూడా వాయిదా పడింది. మరో వైపు చంద్రబాబు తాము పోటీ చేసే స్థానాలపై ప్రకటన చేస్తూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారని, దాంతోనే ఆయన భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నారని అంటున్నారు.