మన పార్టీలో నా పక్కనే కూర్చొని, నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు

జ‌న‌సేన పార్టీలో వెన్నుపోటు నేతలు ఉన్నార‌ని, పక్కన కూర్చుని వెన్నుపోటు పొడుస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

Advertisement
Update:2022-08-23 11:30 IST

జ‌న‌సేన పార్టీలో వెన్నుపోటు నేతలు ఉన్నార‌ని, పక్కన కూర్చుని వెన్నుపోటు పొడుస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్. బయట శత్రువులతో పోరాటం చేయ‌గ‌లం కానీ, పార్టీలో న‌మ్మ‌క‌ద్రోహుల‌తో పోరాటం చాలా క‌ష్ట‌మ‌న్నారు.

మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటే జ‌న‌సేన‌లో ఉండండి.. ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోండంటూ ప‌వ‌న్ హెచ్చ‌రించారు. అసంతృప్తితో ఇక్క‌డే వుంటూ దెబ్బ‌కొట్టే బ‌దులు, వేరే పార్టీలోకి పోయి నన్ను తిట్టినా ఫ‌ర‌వాలేదన్నారు. డబ్బులు తీసుకుని పక్క పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తున్న‌ట్లు తేలితే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కార్యాల‌యంలో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేసే పార్టీ జ‌న‌సేన అని, లోటు పాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతామ‌ని చెప్పారు. అన్ని కులాలకు ఒకే ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని, ఎన్నిక‌ల వ్యూహం ఇప్పుడే చెప్పన‌ని, సందర్భం వచ్చినప్పుడు అమలు చేస్తాన‌ని పేర్కొన్నారు.

వైసీపీ ఇచ్చిన హామీలు విస్మ‌రించింద‌ని, అధికారంలోకి వచ్చి అనేక సమస్యలు సృష్టించింద‌ని ఆరోపించారు. అభివృద్ధి లేకుండా అప్పులు మాత్రమే ప్రజలపై రుద్దుతున్నార‌ని, ప్రభుత్వం చేస్తున్న అప్పులు భవిష్యత్తులో తీర్చలేని స్థితికి తీసుకొచ్చార‌న్నారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకురావాల‌నేది త‌న ధ్యేయ‌మ‌ని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని మ‌ళ్లీ అధికారంలోకి రానివ్వకూడ‌ద‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News