అధికార వైసీపీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత కనపడుతోంది : టీడీపీ అధినేత చంద్రబాబు

వైసీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, భయపెట్టినా ప్రజలు మాత్రం చాలా బాధ్యతగా స్పందించి టీడీపీ బలపరిచిన అభ్యర్థులను తమ ఓట్లతో గెలిపించారని చంద్రబాబు అన్నారు.

Advertisement
Update:2023-03-19 18:50 IST

ఏపీ ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. ప్రజలనే నమ్ముకున్న తెలుగు దేశం పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా చెడు ఎప్పటికైనా ఓడిపోతుందని, భవిష్యత్ టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చైతన్యంతో, బాధ్యతతో వ్యవహరించారని.. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతను తమ ఓట్ల రూపంలో చూపారని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, భయపెట్టినా ప్రజలు మాత్రం చాలా బాధ్యతగా స్పందించి టీడీపీ బలపరిచిన అభ్యర్థులను తమ ఓట్లతో గెలిపించారని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని.. అయినా సరే ప్రజలు మాత్రం వారిని నమ్మలేదని చంద్రబాబు అన్నారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైందని.. దానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు.

టీడీపీ అభ్యర్థుల విజయం వెనుక నిరుద్యోగుల ఆవేదన, రైతుల కష్టాలు, సాయమందని బడుగు, బలహీన వర్గాల బాధ, పెరిగిన ధరలతో కుదేలైన సామాన్యుడు, వారి అరాచకాల కారణంగా బతుకు భారంగా మారిన సగటు మనిషి ఆవేదన ఉందని చంద్రబాబు అన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్ అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యేలా విధ్వంసకర పాలన చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. నాలుగేళ్లలో రాజకీయ పార్టీలు పని చేసే పరిస్థితి లేకుండా పోయిందని.. సీఎం అక్రమాలను నమ్మి దాని తోనే ముందుకు వెళ్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. కానీ సీఎం జగన్ లాంటి దారుణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని తాను ఏనాడూ చూడలేదని చంద్రబాబు చెప్పారు. అన్ని పార్టీలు సిద్ధాంత పరంగా ఉండవని.. కొన్ని పార్టీలు గాలికి పుట్టి గాలిలోనే కలిసి పోతాయని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పని అయిపోయిందని.. ఇక ఆయన ఏ ఎన్నికల్లోనూ తిరిగి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు జోస్యం చెప్పారు. జగన్‌కు అసలు బాధ్యత లేదని.. ఆయన మోసాలు చేయడంతో దిట్ట అని ఆరోపించారు.

వైఎస్ జగన్ ధన బలం, రౌడీయిజం ఎప్పటికీ శాశ్వతం కాదని చంద్రబాబు అన్నారు. ఆయన తన నేరాల్లో అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నారని.. దేశంలో ఏ నాయకుడూ చేయని అరాచకాలు జగన్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పారిశ్రామిక వేత్తలు, ఐఏఎస్‌లు జగన్ కారణంగా జైలుకు వెళ్లారని.. జగన్‌ను నమ్ముకున్న వాళ్లు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. తానొక్కడినే మంచిగా ఉండాలని అనుకునే మనస్తత్వం జగన్‌ది అని చంద్రబాబు అన్నారు.

తనకు ఎవరైనా అడ్డు వస్తే లొంగ దీసుకోవడానికి సామ, దాన, దండోపాయాలను ప్రయోగించడం జగన్ నైజం అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం లేదని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు, జడ్జీలను కూడా బ్లాక్ మెయిల్ చేసేలా అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సీఎస్ సహా ప్రభుత్వ అధికారులను కోర్టులు చీవాట్లు పెట్టే సంఘటనలు జగన్ పాలనలోనే చూస్తున్నామని అన్నారు. పాదయాత్రలు, రోడ్‌షోలు చేస్తే ఆంక్షలు విధిస్తున్నారని.. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసేలా.. ఎవరూ నిరసనలు తెలియజేయకుండా జీవో నెంబర్ 1ని తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News