వైసీపీ నాయకులు Vs ఐ-ప్యాక్
ఐ-ప్యాక్‌పై జగన్ ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో తెలీదు కానీ పార్టీ నేతల్లో చాలామంది వ్యతిరేకంగా ఉన్నారనే విషయం చర్చల్లో బయటపడుతోంది. కానీ ఐ-ప్యాక్‌కు వ్యతిరేకంగా నేతలు ఎవరూ మాట్లాడటంలేదు.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ సంస్థకు మధ్య అంతరం పెరిగిపోతోందట. పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో, మంత్రులు, ఎమ్మెల్యేలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఐ-ప్యాక్ సర్వే పేరుతో జగన్‌కు రిపోర్టులు అందిస్తున్నట్లు పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. 2019 నుండి ఐ-ప్యాక్ అంటేనే జగన్‌కు కళ్ళు, చెవులుగా మారిన వైనం అందరు చూస్తున్నదే.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సంస్థే ఐ-ప్యాక్. నేతలు ఎంతబలంగా ఉన్నా సంస్థలోని కొందరు చేతివాటం కారణంగా సదరు నేతలు బలహీనపడినట్లు, వారిపై వ్యతిరేకత పెరిగిపోతోందనే రిపోర్టుల్లో చెబుతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఐ-ప్యాక్‌పై జగన్ ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో తెలీదు కానీ పార్టీ నేతల్లో చాలామంది వ్యతిరేకంగా ఉన్నారనే విషయం చర్చల్లో బయటపడుతోంది. కానీ ఐ-ప్యాక్‌కు వ్యతిరేకంగా నేతలు ఎవరూ మాట్లాడటంలేదు.
ఐ-ప్యాక్‌లో పనిచేస్తున్న కొంతమంది చేతివాటం కారణంగా బలవంతులను బలహీనులుగాను, బలహీనులను బలవంతులుగాను పేర్కొంటూ జగన్‌కు రిపోర్టులు అందుతున్నట్లు పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సంస్థ తరపున వందలాది మంది అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా తిరుగుతున్నారు. పార్టీకి సంబంధం లేకుండా తిరుగుతూ నివేదికలు తయారుచేసి ఐ-ప్యాక్ హెడ్ ఆఫీసుకు పంపుతున్నారు.
అక్కడ అన్నింటినీ సమ్ అప్ చేసి ఫైనల్ రిపోర్టు జగన్‌కు అందిస్తున్నారు. ఈ రిపోర్టులోనే కొంతమంది విషయంలో తప్పుడు సమాచారం జగన్‌కు అందుతున్నాయనేది పార్టీలో చర్చల సారాంశం. కొంతమంది ఎమ్మెల్యేలు రెగ్యులర్‌గా జనాల్లోనే తిరుగుతున్నా తిరగటంలేదని రిపోర్టులు అందుతున్నాయట. ఎందుకిలా ఇస్తున్నారంటే సదరు ఎమ్మెల్యే ఐ-ప్యాక్ బృందాన్ని పట్టించుకోవటంలేదట. ఇదే సమయంలో ప్రత్యర్థివర్గం ఐ-ప్యాక్ బృందంతో మంచిగా ఉన్నకారణంగా సదరు నేతకు అనుకూలంగా రిపోర్టులు తయారవుతున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తంమీద వైసీపీ నాయకులకు ఐ-ప్యాక్ బృందానికి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతున్నట్లు అర్థమవుతోంది.