టీడీపీలో కొత్త చిచ్చు మొదలైందా?
చిలకలూరిపేట నియోజకవర్గంలో హడావుడి చేస్తున్న భాష్యం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భాష్యం ప్రవీణ్‌పై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపోయారు. ప్రవీణ్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ చంద్రబాబునాయుడునే నిలదీశారు.
తెలుగుదేశం పార్టీలో కొత్త చిచ్చు మొదలైనట్లే ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో హడావుడి చేస్తున్న భాష్యం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భాష్యం ప్రవీణ్‌పై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపోయారు. ప్రవీణ్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ చంద్రబాబునాయుడునే నిలదీశారు. ఎన్నికల ముందు ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో డబ్బున్నవాళ్ళు, ఎన్ఆర్ఐలు వచ్చి కొంత డబ్బు ఖర్చుపెట్టడం మామూలే అన్నారు. అక్కడో 10 వేలు, ఇక్కడో పదివేలు ఖర్చుపెట్టినంత మాత్రాన వాళ్ళకి టికెట్లిచ్చేస్తే ఏళ్ల తరబడి కష్టపడతున్న తమలాంటి సీనియర్లు ఏమవ్వాలని నిలదీశారు.
ఇక్కడ విషయం ఏమిటంటే మహానాడు సందర్భంగా భాష్యం ఫౌండేషన్ ఛైర్మన్ ప్రవీణ్ పార్టీకి కోటి రూపాయల విరాళమిచ్చారు. చిలకలూరిపేటలో పోటీచేసే ఉద్దేశంతో నియోజకవర్గంలో తిరుగుతూ డబ్బులు ఖర్చుపెడుతున్నారు. బాగా డబ్బుంది కాబట్టి, ఖర్చులు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు, లోకేష్ గుడ్ లుక్సులో పడ్డారు. దీన్ని ప్రత్తిపాటి తట్టుకోలేకపోతున్నారు. 2019లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ప్రత్తిపాటి పెద్దగా కనబడలేదు. హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. తన సీటుకు ఎసరొచ్చే ప్రమాదముందని తెలియగానే సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు.
అప్పటికే ప్రవీణ్ నియోజకవర్గంలో బాగా పరిచయాలు పెంచేసుకున్నారు. ఇక గుడివాడలో కూడా దాదాపు ఇదే సీన్ కనబడుతోంది. వెనిగండ్ల రాములు అనే ఎన్ఆర్ఐ చొచ్చుకుపోతున్నారు. అయితే రాముకు మిగిలిన నేతలు సహకరించటంలేదు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమను కాదని రాముకు టికెటిస్తే సహించేదిలేదంటున్నారు. పార్టీ మీటింగుల సమాచారం కూడా రాముకు చెప్పటంలేదు.
ఫౌండేషన్లు, ట్రస్టులు, ఎన్ఆర్ఐ హోదాలో పార్టీలో హడావుడిచేస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో సుమారు 15 మంది దాకా ఇలాంటి వాళ్ళు టికెట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. వీళ్ళంతా పార్టీ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా చంద్రబాబు, లోకేష్‌తో మాట్లాడుకునే పార్టీలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. వీళ్ళవల్ల మిగిలిన నేతల్లో అభద్రత పెరిగిపోతోంది. చివరకు చంద్రబాబు ఎవరికి టికెట్లిస్తారో తెలియకపోవటంతో అందరిలోనూ అయోమయం పెరిగిపోతోంది. గుడివాడ, చిలకలూరిపేటలో గొడవ మొదలైంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఏమవుతుందో చూడాలి.