ముఖ్యమంత్రుల భేటీ.. అజెండా ఏంటి..? ఆరోపణలు ఎందుకు..?

హైదరాబాద్ లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా అజెండాలో అంశాన్ని పొందుపరిచారు. అటు తెలంగాణ తమకు ఏపీలోని ఓడరేవుల్లో వాటా కావాలంటోంది.

Advertisement
Update:2024-07-06 08:16 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా మారింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో సమావేశమవుతారు. ఈ సమావేశంపై ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ సమావేశంపై కొన్ని సూచనలు చేసింది. ఏపీ ప్రతిపక్షం వైసీపీ మాత్రం పూర్తిగా పట్టనట్టే ఉంది.

అజెండా ఏంటి..?

ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి 10 అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్, ఆర్థిక శాఖ సహా ఇతర కీలక శాఖల కార్యదర్శులు కూడా హాజరవుతారు. ప్రధానంగా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్లకు సంబంధించి ఆస్తుల పంపకాలపై చర్చించే అవకాశముంది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై కూడా సమీక్ష జరుగుతుంది. ఉమ్మడి ఆస్తుల పంపకాలపై పీటముడి విప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

మీకివి.. మాకవి..

హైదరాబాద్ లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా అజెండాలో అంశాన్ని పొందుపరిచారు. అటు తెలంగాణ తమకు ఏపీలోని ఓడరేవుల్లో వాటా కావాలంటోంది. టీటీడీలో భాగం ఇవ్వాలని, కోస్టల్ కారిడార్ లో కూడా తమకూ వాటా కావాలని తెలంగాణ అడగబోతున్నట్టు తెలుస్తోంది. వీటికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపితే.. ప్రతిపక్షం విమర్శలు కాచుకోవాల్సిందే. ఇక విలీన మండలాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది. విభజన సమయంలో తెలంగాణనుంచి ఏపీలో కలిసిన మండలాల్లో సమస్యలు తిష్టవేశాయి. వాటిని తిరిగి తమకు అప్పగించాలని తెలంగాణ కోరుతోంది. బీఆర్ఎస్ కూడా ఇదే విషయంపై డిమాండ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించింది.

గురు, శిష్యులు.. అంటూ ఇప్పటికే చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒకరికొకరు రాజకీయంగా సహకరించుకుంటున్నారని అంటున్నారు. భేటీ తర్వాత ఈ ఆరోపణలు, విమర్శలు మరింత పెరిగే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News