ఎన్డీఏ లోకి టీడీపీ.. మహూర్తం ఎప్పుడంటే..?

ఎన్నికల టైమ్ వచ్చేసరికి బీజేపీకి ఏపీలో సపోర్ట్ కావాల్సి వచ్చింది. వైసీపీతో పొత్తు కుదరదు కాబట్టి, టీడీపీని ఎన్డీఏలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది బీజేపీ.

Advertisement
Update:2023-06-17 08:14 IST

ఎన్డీఏ ఏర్పాటు సమయంలో బీజేపీతో కలసి ప్రయాణం చేసిన టీడీపీ మరోసారి అదే గూటికి చేరుకోబోతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఇది మాత్రం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏ నుంచి విడిపోయినా 2014 ఎన్నికల సమయంలో తిరిగి కూటమిలో చేరారు ఏపీలో అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే నెపంతో బయటకొచ్చేసిన బాబు 2019 ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొని బొక్కబోర్లా పడ్డారు. తిరిగి 2024 ఎన్నికల సమయానికి ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అమిత్ షా తో భేటీ తదనంతర పరిణామాలన్నీ ఇందులో భాగంగా జరిగినవే.

ఎందుకంటే..?

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే చంద్రబాబుకి ఈసారి చాలా కష్టం. అందుకే బీజేపీ వల్ల ఉపయోగం లేదని తెలిసినా ఓట్ల చీలికను ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా బీజేపీతో పాటు జనసేనను కూడా కలుపుకొని పోవాలనుకుంటున్నారు. అటు బీజేపీకి కూడా ఏపీలో ఒంటరిపోరు ఏమాత్రం లాభసాటి కాదు. జనసేన తోడున్నా పెద్ద ప్రయోజనం లేదు. టీడీపీతో కలిస్తే కనీసం అసెంబ్లీలోకి ఎంట్రీ అయినా దక్కుతుందని పార్టీ పెద్దల ఆలోచన.

వైసీపీ సంగతేంటి..?

విచిత్రం ఏంటంటే.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో బీజేపీకి ఎలాంటి పేచీ లేదు. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరడం ఇష్టంలేని ఏపీ సీఎం జగన్, రాజ్యసభలో చాలాసార్లు కాషాయదళానికి సహాయం చేశారు. అందుకే పోలవరం నిధులు వంటి విషయాల్లో వైసీపీకి పరోక్షంగా సాయపడి ఆ రుణం తీర్చుకుంది కేంద్రం. కానీ ఎన్నికల టైమ్ వచ్చేసరికి బీజేపీకి ఏపీలో సపోర్ట్ కావాల్సి వచ్చింది. వైసీపీతో పొత్తు కుదరదు కాబట్టి, టీడీపీని ఎన్డీఏలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది బీజేపీ.

ఎన్డీఏ కూటమినుంచి బయటకు వచ్చిన అకాలీదళ్ కూడా తిరిగి బీజేపీతో చేతులు కలిపే పరిస్థితుల్లో ఉంది. ఇటు టీడీపీలాంటి పాత పార్టీలు కూడా దగ్గరకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా ఇతర బీజేపీ వైరి వర్గాలు బలపడుతున్నాయనుకుంటున్న వేళ.. పాత మిత్రులను దగ్గరకు చేర్చుకోడానికి కాషాయదళం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News