నాని, వంశీ గైర్హాజరు.. టీడీపీ రచ్చ మొదలు..
ఆ ఇద్దరి భుజాలపై తుపాకి పెట్టి జగన్ ని టార్గెట్ చేయాలని చూస్తోంది టీడీపీ. ఆ ఇద్దరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో టీడీపీ పని మరింత సులువైంది.
చంద్రబాబుని రోజూ తిట్టిపోసే నేత కొడాలి నాని, ఒకే ఒకసారి సీరియస్ గా చెడామడా వాయించేసి అసెంబ్లీ బయట ఆయన కన్నీళ్లు పెట్టుకునేలా చేసిన నేత వల్లభనేని వంశీ. వీరిద్దరూ సీఎం జగన్ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. ఇక చూస్కోండి.. టీడీపీ నేతలకు పట్టలేని సంతోషం వచ్చింది. వారిద్దరూ మీటింగ్ కి రాలేదు, లోపల ఏదో జరుగుతోందంటూ నానార్థాలు తీస్తున్నారు. జగన్ పై వారిద్దరూ అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ సోషల్ మీడయా విభాగం రచ్చ చేస్తోంది.
చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ తర్వాత క్షమాపణ చెప్పిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఒకటి రెండుసార్లు గన్నవరం పంచాయితీ సీఎం జగన్ వద్దకు వచ్చినా దాన్ని సజ్జల సామరస్యంగా పరిష్కరించారు. 2024లో గన్నవరంలో వైసీపీ తరపున నిలిచేది, గెలిచేది వంశీయేనని స్పష్టం చేశారు. కానీ ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో వంశీ తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. దీంతో ఆయన జగన్ కు వ్యతిరేకంగా వెళ్తున్నారని టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. వంశీ మళ్లీ తమతో కలుస్తారని కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అటు గన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ పాల్గొనడంలేదు. టికెట్ ఆయనకే కన్ఫామ్ అన్నారు కాబట్టి మిగతా నేతలు ఆసక్తి చూపించడంలేదు. దీంతో గన్నవరం గడప గడపపై జగన్ ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం.
నాని సంగతేంటి..?
మాజీ మంత్రి కొడాలి నాని హిట్ లిస్ట్ 27లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని, ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని చెడామడా తిడుతున్నా, జనాల్లోకి మాత్రం వెళ్లడంలేదు. జగన్ అటు ప్రెస్ మీట్లను పట్టించుకుంటున్నారు, ఇటు గడప గడపకూ వెళ్లాల్సిందేనంటున్నారు. ప్రతిపక్షాలను ఉతికి ఆరేసే నేతల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు, అదే సమయంలో గడప గడపకు వెళ్లకపోతే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన మీటింగ్ కి కొడాలి నాని హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది.
మీటింగ్ కి ఎందుకు రాలేదు అనే విషయంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ స్పందించలేదు. ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా తేలడంలేదు. దీంతో టీడీపీ, ఈ ఇద్దరి భుజాలపై తుపాకి పెట్టి జగన్ ని టార్గెట్ చేయాలని చూస్తోంది. ఇద్దరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో వారి పని మరింత సులువైంది. వైసీపీ నుంచి ఈ వ్యవహారంలో ఇంకా కౌంటర్లు పడలేదు. నేరుగా వంశీ, నాని రంగంలోకి దిగుతారా.. లేదా ఆ అవకాశం ఇతర నేతలకు ఇస్తారా అనేది వేచి చూడాలి.