ఇప్పుడు కోర్టులు సక్రమంగా పనిచేస్తున్నాయట!
చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయటంతో పాటు జడ్జి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో తెలియదు.
దేశంలోని మరే ప్రాంతీయ పార్టీకి లేని విచిత్రమైన అలవాటు తెలుగుదేశం పార్టీకి ఉంది. అదేమిటంటే అధికారంలో ఉంటే తనిష్టప్రకారం చేసుకుపోతుంది. న్యాయం, చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ దేన్నీపట్టించుకోదు. అదే ఖర్మంజాలక ప్రతిపక్షంలో ఉంటే వెంటనే ప్రజాస్వామ్యం, మీడియా విలువలు, చట్టం, రాజ్యాంగం అన్నింటి గురించి పదేపదే మాట్లాడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాసరే తాను చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలని అనుకుంటుంది. అలా జరగకపోతే వెంటనే వివిధ వ్యవస్థల ద్వారా ప్రభుత్వాన్ని అడ్డుకుంటునే ఉంటుంది.
ఇప్పుడు జరిగిందేమిటంటే గడచిన మూడున్నరేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో అనేక కేసులు వేసి ఇబ్బందిపెట్టింది. కోర్టులు కూడా అప్పట్లో టీడీపీ పిటీషన్ వేయటం ఆలస్యం వెంటనే ప్రభుత్వ నిర్ణయాలు అమలుకాకుండా స్టే ఇచ్చేసేవి. దాంతో న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా పనిచేస్తోందని చంద్రబాబు అండ్ కో ఎన్నోసార్లు చెప్పారు. అదే సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు నుండి లోకేష్ అండ్ కోతో పాటు ఎల్లో మీడియా న్యాయ వ్యవస్థపై ఎన్ని దారుణమైన కామెంట్లు చేసిందో అందరు చూసిందే. చంద్రబాబుకు బెయిల్ దొరక్కపోవటంతో జగన్ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నట్లు పదేపదే ఆరోపించారు.
సీన్ కట్ చేస్తే హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వగానే న్యాయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తోందని అభినందిస్తున్నారు. సత్యాన్ని, ధర్మాన్ని కోర్టు గెలిపించినట్లు లోకేష్, అచ్చెన్నాయుడు ప్రకటించటమే విడ్డూరంగా ఉంది. అంటే కోర్టులు తాము అనుకున్నట్లు పనిచేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు. సత్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసం న్యాయ వ్యవస్థ పనిచేస్తోంది. అదే చంద్రబాబుకు బెయిల్ నిరాకరించి ఉంటే వెంటనే వ్యవస్థలను జగన్ మ్యానేజ్ చేస్తున్నట్లు రెచ్చిపోయేవారు.
చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయటంతో పాటు జడ్జి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో తెలియదు. ఒకవేళ సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దయితే మళ్ళీ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నాడని జగన్‌పై నానా గోల చేయటం ఖాయం. అదేదో సినిమాలో బలగం పొట్టి సీతయ్య డబుల్ స్టేట్‌మెంట్‌లాగ లోకేష్ అండ్ కో రెండు రకాల ప్రకటనలతో రెడీగా ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.