కేసీఆర్ ని చూసి నేర్చుకో జగన్.. టీడీపీ హితబోధ

తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు, మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ తేల్చి చెబితే, ఏపీ ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయల అప్పుకోసం రైతుల జీవితాలను తాకట్టు పెడుతోందన్నారు సోమిరెడ్డి.

Advertisement
Update:2022-09-30 16:14 IST

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. అందుకు శ్రీకారంగా ఈరోజు యాదాద్రి దర్శనానికి వెళ్లారు కూడా. సరిగ్గా ఇదే రోజు పొరుగు రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వంపై స్పందించాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించింది. హరీష్ రావు తమ ఇంటిని చక్కదిద్దుకోవాలని, పక్క రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయం ఆయనకెందుకంటూ ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే టీడీపీ ఈ విషయంలో పూర్తి భిన్నంగా స్పందించింది. మోటర్లకు మీటర్లు పెట్టను అని తేల్చి చెప్పిన కేసీఆర్, మోదీని ఢీకొన్నారంటూ మెచ్చుకుంటున్నారు టీడీపీ నేతలు.

కేసీఆర్ పై ప్రశంసలు..

టీడీపీ నేతలు కేసీఆర్ పై ఇటీవల కాలంలో ప్రశంసలు కురిపించిన సందర్భాలు లేవు, ఆ మాటకొస్తే గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వ విధానాలను టీడీపీ నేతలు ఎప్పుడూ మెచ్చుకోలేదు. అలాంటిది సడన్ గా మాజీ మంత్రి సోమిరెడ్డి కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు. తెలంగాణలో ఆయన 24గంటలు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఏపీలో ఆ పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు, మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ తేల్చి చెబితే, ఏపీ ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయల అప్పుకోసం రైతుల జీవితాలను తాకట్టు పెడుతోందన్నారు. కేసీఆర్ ఎకరాకి 19వేల రూపాయలు రైతుబంధు ఇస్తున్నారని చెప్పారు సోమిరెడ్డి, ఏపీలో రైతు భరోసా.. పొలం విస్తీర్ణానికి సంబంధం లేకుండా, రైతుకింత అని జమచేస్తున్నారని చెప్పారు. ఇక తెలంగాణలో ధాన్యం సేకరించిన మూడోరోజే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, ఏపీలో ఆరు నెలలు వేచి చూసినా అరకొరే ఇచ్చి సరిపెడుతున్నారని విమర్శించారు.

మొత్తమ్మీద జగన్ ని విమర్శించే క్రమంలో కేసీఆర్ ని పొగిడేశారు సోమిరెడ్డి. ఇదేదో యాదృచ్ఛికం అనుకోలేం. అలాగని మరీ ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ని ఇంతలా పొగడాల్సిన అవసరం కూడా ఇప్పటికిప్పుడు టీడీపీకి లేదు. కేసీఆర్ మూడో ప్రత్యామ్నాయ ప్రయత్నం సక్సెస్ అయితే చంద్రబాబు వారి వెంట నడిచేందుకు ఏమాత్రం మొహమాటపడరనే విషయం మాత్రం అర్థమవుతోంది. కానీ ఒకేరోజు వైసీపీ నుంచి విమర్శలు, టీడీపీనుంచి ప్రశంసలు టీఆర్ఎస్ కి దక్కడం మాత్రం విశేషం.

Tags:    
Advertisement

Similar News