50 ఏళ్లకే పెన్షన్.. బీసీలకు బాబు తాయిలం

గతంలో బీసీల తోకలు కత్తిరిస్తామన్న బాబు ఇప్పుడు వారిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోయడం విడ్డూరం. జగన్ అమలు చేస్తున్న పథకాలనే అటు, ఇటు మార్చి తాను అధికారంలోకి వస్తే సరికొత్తగా అమలు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం.

Advertisement
Update:2024-03-05 19:55 IST

సీఎం జగన్ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యం చూసి చంద్రబాబుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. టీడీపీకి దూరమవుతున్న బీసీ వర్గానికి తిరిగి గేలం వేసేందుకు ఈరోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ అంటూ 10 అంశాలను తెరపైకి తెచ్చారు.

50 ఏళ్లకే పెన్షన్..

బీసీ డిక్లరేషన్ లో మొదటిది, ప్రధానమైనది ఇదే. బీసీలకు 50 ఏళ్లకే సామాజిక పెన్షన్ ఇస్తామంటూ తాయిలాలు ప్రకటించారు చంద్రబాబు. రూ.3 వేలుగా ఉన్న పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని కూడా చెప్పారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతంగా పునరుద్దరిస్తామన్నారు. తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామన్నారు.


ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తామని, పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామని చెప్పారు చంద్రబాబు. చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తామని, చంద్రన్న బీమా రూ.10 లక్షలకు పెంచి ఇస్తామని, పెళ్లి కానుకలు లక్ష రూపాయలకు పెంచుతామని, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని, విద్యా పథకాలన్నీ తిరిగి తెస్తామని, షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామని, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తామననే హామీలను డిక్లరేషన్లో పొందుపరిచారు. బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.

తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కొత్తగా పార్టీ పెట్టిన వ్యక్తిలాగా చంద్రబాబు బీసీలకు వరాలిస్తున్నారంటూ ఆల్రడీ సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ బండారాన్ని బయటపెట్టారు. బీసీ డిక్లరేషన్లో కూడా దాదాపు అవే హామీలున్నాయి. గతంలో బీసీల తోకలు కత్తిరిస్తామన్న బాబు ఇప్పుడు వారిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోయడం విడ్డూరం. దాదాపు జగన్ అమలు చేస్తున్న పథకాలనే అటు, ఇటు మార్చి తాను అధికారంలోకి వస్తే సరికొత్తగా అమలు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. 

Tags:    
Advertisement

Similar News