టీడీపీలో కొత్త వ్యవస్థ‌?

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 22వ తేదీ కల్లా కుటుంబ సారథుల నియామకాలు జరిగిపోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

Advertisement
Update:2023-08-23 11:33 IST

అదేదో సామెతలో చెప్పినట్లుగా ఇంతకాలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్‌ వ్యవస్థ‌పై నానా రకాలుగా బురదచల్లేస్తున్న చంద్రబాబునాయుడు టీడీపీలో కూడా అలాంటి వ్యవస్థ‌కు రెడీ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం నియమించిన వలంటీర్ వ్యవస్థ‌కు ధీటుగా చంద్రబాబు కుటుంబ సారథుల వ్యవస్థ‌ను పార్టీలో ప్రవేశపెడుతున్నారు. ఈ కాన్సెప్టును ఏర్పాటు చేసుకోవాలని చాలాకాలం క్రితమే అనుకున్నా ఇంతవరకు చేయలేదు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 22వ తేదీ కల్లా కుటుంబ సారథుల నియామకాలు జరిగిపోవాలని డిసైడ్ అయ్యారు.

సుమారు 8 లక్షల మందితో ఏర్పాటు కాబోయే కొత్త వ్యవస్థ‌లో సగం మంది మహిళలే ఉండబోతున్నారు. ప్రతి 60 ఇళ్ళకు ఇద్దరు సారథులను నియమించబోతున్నారు. వీళ్ళంతా తమకు కేటాయించిన ఇళ్ళకు రెగ్యులర్‌గా వెళ్తూ సమస్యలను, ప్రభుత్వం నుండి పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది తెలుసుకుంటారు. ప్రభుత్వం ద్వారా ఎదురవుతున్న కష్టాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి చేరవేస్తారు.

వీళ్ళనే రేపటి ఎన్నికల సమయంలో కూడా బూత్ కమిటీ మెంబర్లుగా కూడా ఉపయోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయ్యింది. కుటుంబ సారథుల వల్ల ఏమవుతుందంటే టీడీపీ వాళ్ళెవరు కాని వాళ్ళెవరు అన్న విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగముంటుంది. టీడీపీ ఎందుకింత హడావుడిగా చేస్తోందంటే తమ ఓటర్లు ఎవరు అనే విషయాన్ని ఐడెంటిఫై చేసుకుని రక్షించుకునేందుకే అని అనుమానంగా ఉంది. దీనివల్ల రేపటి ఎన్నికల్లో తమకు పడే ఓట్లు, వ్యతిరేకంగా పడే ఓట్ల విషయంలో ఒక క్లారిటి వచ్చే అవకాశముంది.

అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. అదేమిటంటే ఒకవైపు వలంటీర్లు, మరోవైపు కుటుంబ సారథులు ఒకేసారి ఇళ్ళ దగ్గరకు వెళ్ళినపుడు లేదా ఒకే ఏరియాలో తిరుగుతూ ఎదురుపడినప్పుడు గొడవలయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే వలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికే చంద్రబాబునాయుడు, తమ్ముళ్ళు, పవన్ కల్యాణ్ ఎలా విషం చిమ్ముతున్నారో అందరు చూస్తున్నదే. ఒకవైపు వలంటీర్ వ్యవస్థ‌ను అవమానిస్తునే, మళ్ళీ చంద్రబాబు కూడా అలాంటి వ్యవస్థ‌నే పార్టీలో ఏర్పాటు చేసుకోవాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. దీని కారణంగానే రెండు వ్యవస్థ‌ల్లో పనిచేసే వారిమధ్య గొడవలు జరిగే అవకాశాలున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    
Advertisement

Similar News