ముందస్తుకు ముహూర్తం పెట్టిన చంద్రబాబు

అసలు సిద్ధంగా ఉండాల్సింది తమ్ముళ్ళు కాదు తానే అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. 119 నియోజకవర్గాలు మాత్రమే ఇప్పటికి సమీక్షించారు. మిగిలిన 56 నియోజకవర్గాలను ఇంకా ముట్టుకోలేదు.

Advertisement
Update:2022-11-03 09:50 IST

ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయట. వచ్చే ఏడాది మే నెలలో కానీ లేదా డిసెంబర్‌లో కానీ ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమని చంద్రబాబు నాయుడు ముహూర్తం ఫిక్స్‌ చేసేశారు. పార్టీ నేతలతో జరిగిన సమీక్షలో మాట్లాడుతు ఎక్కడా అప్పులు పుట్టక, ఆదాయాలు పెంచుకోలేక జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నానా అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలు తప్పవని ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్న ఐవైఆర్‌ కృష్ణారావు ట్వీట్‌ చేశారు.

బహుశా ఐవైఆర్‌ చేసిన ట్వీట్‌ నే చంద్రబాబు ఫాలో అయ్యారేమో తెలీదు. అందుకనే తమ్ముళ్ళకు కూడా ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. ఇక్కడ ముందస్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేకంగా పిలుపివ్వాల్సిన అవసరమేలేదు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీచేయకతప్పదుకదా. ఇంతోటిదానికి మళ్ళీ తమ్ముళ్ళు సిద్ధంగా ఉండటం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి.

అసలు సిద్ధంగా ఉండాల్సింది తమ్ముళ్ళు కాదు తానే అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. 119 నియోజకవర్గాలు మాత్రమే ఇప్పటికి సమీక్షించారు. మిగిలిన 56 నియోజకవర్గాలను ఇంకా ముట్టుకోలేదు. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే 19 మంది ఎమ్మెల్యేలు తిరిగి పోటీచేస్తారని అనుకోవాలి. ఇక సమీక్షచేసిన మిగిలిన 100 నియోజకవర్గాల్లో మరో 20 మందికి టికెట్‌ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 80 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను గట్టిగా పనిచేయాలని మాత్రమే చెప్పారు.

అంటే సమీక్షచేసిన 80 నియోజకవర్గాలు, చేయాల్సిన 56 నియోజకవర్గాలు కలిపి 136 నియోజకవర్గాల్లో ఎవరు పోటీచేస్తారో తెలీదు. మధ్యలో జనసేనతో పొత్తంటున్నారు. జనసేనతో పొత్తుంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారో తెలీదు. ఇంకా ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో తెలీదు. వీటిల్లో ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు. ముందస్తుకు నిజంగా సిద్ధంగా ఉండాల్సిందే చంద్రబాబు అనర్థమవుతోంది. ముందస్తుకు తాను సిద్ధంకాకుండా తమ్ముళ్ళని సిద్ధంగా ఉండాలని చెప్పటమే విచిత్రంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News