పార్లమెంట్ ముందు 'సేవ్ చంద్రబాబు'.. పట్టించుకునేవారేరి..?
ఎవరూ పట్టించుకోలేదు. అందరూ లైట్ తీసుకున్నారు. ఇప్పటికే ఇది అరిగిపోయిన రికార్డ్ కావడంతో పార్లమెంట్ ముందు కూడా బాబు జైలు వ్యవహారానికి స్పందన కరువైంది.
అనుకున్నట్టుగానే పార్లమెంట్ సమావేశాల తొలిరోజునుంచీ 'సేవ్ చంద్రబాబు' అంటూ ఢిల్లీలో రచ్చ చేస్తున్నారు టీడీపీ ఎంపీలు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనకు లోకేష్ కూడా వచ్చారు. అందరూ కలసి ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నిలబడి ఫొటోలు దిగారు.
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, అధికార దుర్వినియోగంతో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు నేతలు. అయితే వీరిని పట్టించుకునేవారు కరువయ్యారు. పార్లమెంట్ ఆవరణలో నిరసనలు అంటే పక్కపార్టీల నేతలు, కనీసం ఏంటా అని పరిశీలిస్తారు. అవసరం అనుకుంటే మద్దతిస్తారు, లేదంటే కనీసం ఖండిస్తూ మీడియాతో మాట్లాడతారు. విచిత్రం ఏంటంటే.. చంద్రబాబు వ్యవహారాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందరూ లైట్ తీసుకున్నారు. ఇప్పటికే ఇది అరిగిపోయిన రికార్డ్ కావడంతో పార్లమెంట్ ముందు కూడా బాబు జైలు వ్యవహారానికి స్పందన కరువైంది.
లోకేష్ ఫ్లాప్ షో..
ఢిల్లీ వెళ్లి రోజులు గడుస్తున్నా నారా లోకేష్ కి అపాయింట్ మెంట్ లు దొరకలేదు. గతంలో జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ వెటకారంగా స్పందించే టీడీపీ అనుకూల మీడియా, ఇప్పుడు లోకేష్ విషయంలో సైలెంట్ గా ఉంది. లోకేష్ ని కలిసేందుకు ఎవరూ అపాయింట్ మెంట్ లు ఇవ్వలేదు. పోనీ తండ్రి అరెస్ట్ అయి, దిగాలుగా ఉన్న యువనాయకుడిని ఎవరూ పరామర్శించలేదు, పలకరించనూలేదు. దీంతో ఎంపీలతో పదే పదే మీటింగ్ లు పెట్టుకుంటూ వాటినే మీడియాకు పంపిస్తూ కాలం గడుపుతున్నారు లోకేష్. ఆయన ఢిల్లీ పర్యటన ఫ్లాప్ షో అంటూ వైసీపీ కౌంటర్లిస్తోంది. ఎవరెన్ని మాట్లాడినా, ఢిల్లీలో ఎవరూ తలుపులు తెరవకపోవడంతో లోకేష్ మరింత దిగాలు పడ్డారు.