తగ్గేదే లేదంటున్న సునీత.. అవినాష్ పై సుప్రీంలో పిటిషన్
ఈనెల 25న తెలంగాణ హైకోర్టు, అవినాష్ బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈలోగా సునీతా రెడ్డి హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో కలకలం రేగింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ విచారణకంటే.. ఎక్కువగా కోర్టుల్లోనే విచారణ జరుగుతున్నట్టుంది. ముందస్తు అరెస్ట్ లు వద్దంటూ కొందరు, బెయిల్ కోసం కొందరు, ఆ బెయిల్ వద్దంటూ ప్రత్యర్థి వర్గం, అసలు సీబీఐ విచారణ అధికారుల్ని మార్చేయాలంటూ నిందితుల బంధువులు.. ఇలా తెలంగాణ హైకోర్ట్, సుప్రీంకోర్టుల్లో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి, విచారణలు జరుగుతున్నాయి. తాజాగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై రేపు విచారణ జరుగుతుంది.
ఇటీవల సీబీఐ విచారణ, భాస్కర్ రెడ్డి అరెస్ట్, ఆయన తనయుడు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ల వ్యవహారం మూడు రోజులపాటు ఉత్కంఠకు కారణమైంది. చివరకు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈనెల 25 వరకు ఆయను విచారణకు పిలవొచ్చు కానీ, అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐకి ఆదేశాలిచ్చింది. దీంతో రెండురోజులుగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ఈనెల 25న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈలోగా సునీతా రెడ్డి తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో కలకలం రేగింది.
సునీతా రెడ్డి టీడీపీతో కుమ్మక్కయ్యారని, వివేకా హత్య వెనక ఆమె, ఆమె భర్త కూడా ఉన్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివేకా సంబంధాలను కూడా ఏకరువు పెడుతున్నారు. వీటిపై ఎప్పుడూ సునీతా రెడ్డి నేరుగా స్పందించలేదు. తాజాగా ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో ఈ వ్యవహారంలో ఆమె పట్టుదలగా ఉన్నట్టు తేలిపోయింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మరో ఐదురోజులే అమలులో ఉంటాయి. ఈలోగా సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేశారు. శుక్రవారం దీనిపై విచారణ జరగాల్సి ఉంది.