ఏపీలో వేసవి సెలవులు పిల్లలకే, టీచర్లకు కాదు..
ఇక స్కూల్ పిల్లలకు వర్క్ షీట్లు తయారు చేయడం, రిపోర్ట్ లు రెడీ చేయడం వంటి కార్యక్రమాలు కూడా అదనం. వీటిని స్కూల్ లోనే రెడీ చేయాల్సి ఉంటుంది. అంటే సెలవుల్లో ఉపాధ్యాయులు కచ్చితంగా స్కూల్ కి వెళ్లాల్సిందే.
మే-1నుంచి ఏపీలో వేసవి సెలవులు మొదలు కాబోతున్నాయి. అయితే సెలవులు కేవలం విద్యార్థులకేనని, ఉపాధ్యాయులకు కాదని తేలిపోయింది. నేరుగా టీచర్లకు సెలవులు లేవు అని ఆదేశాలివ్వలేదు కానీ, వారికి ఊపిరాడకుండా పని ఇచ్చారు. పోనీ ఆ పని ఇంటి దగ్గర కూర్చుని చేసుకోవచ్చా అంటే అదీ లేదు. కచ్చితంగా స్కూల్ కి రావాలి, పని చేయాల్సిందే. నాడు-నేడు పనుల్ని ఇంటి దగ్గర ఉండి పర్యవేక్షిస్తామంటే కుదరదు. కచ్చితంగా స్కూల్ కి వెళ్లాలి, నిర్మాణ పనుల్ని పర్యవేక్షించాలి, నాణ్యత పరిశీలించాలి. దీనివల్ల పనుల్లో నాణ్యత మెరుగవుతుందనేది వందశాతం నిజం. అదే సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన సొంత ఇంటి నిర్మాణంలాగే స్కూల్ పనులకు కూడా టైమ్ కేటాయించాల్సి ఉంటుంది.
వర్క్ షీట్లు..
ఇక స్కూల్ పిల్లలకు వర్క్ షీట్లు తయారు చేయడం, రిపోర్ట్ లు రెడీ చేయడం వంటి కార్యక్రమాలు కూడా అదనం. వీటిని స్కూల్ లోనే రెడీ చేయాల్సి ఉంటుంది. అంటే సెలవుల్లో ఉపాధ్యాయులు కచ్చితంగా స్కూల్ కి వెళ్లాల్సిందే, పని చేయాల్సిందే. జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా బాధ్యత కూడా పూర్తిగా ప్రధానోపాధ్యాయులపై పెట్టేశారు కాబట్టి వారు కూడా ఆ పనుల్లో బిజీ కావాల్సిందే. వీటితో సరిపోతుందనుకుంటే ఆ తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. మధ్యలో హైస్కూల్ హెడ్మాస్టర్లకు టెన్త్ క్లాస్ టీసీల పంపిణీ కూడా ఉంటుంది.
సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లేందుకు, టూర్లు ప్లాన్ చేసుకోడానికి కూడా జంకుతున్నారు. ఉపాధ్యాయులు బడికి రావాలా? వద్దా? అనే విషయం నేరుగా చెప్పకుండా వారికి ఫుల్లుగా స్కూల్ వర్క్ ఇచ్చేశారు. మొత్తంగా వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాలని ఉపాధ్యాయులకు సూచనలు అందాయి.