అసెంబ్లీలో ఈలలు వేసిన టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు నిరసనలతో సభ సజావుగా జరగకుండా ప్రయత్నించారు. వారి అరుపులు, కేకలతో సభలో ఏం జరుగుతోందో తెలియని గందరగోళం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలు జరగకుండా పదేపదే అడ్డుతగిలారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఎంత చెప్పినా వినకపోవడమే కాకుండా సభలో ఈలలు వేయడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు
మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు నిరసనలతో సభ సజావుగా జరగకుండా ప్రయత్నించారు. వారి అరుపులు, కేకలతో సభలో ఏం జరుగుతోందో తెలియని గందరగోళం ఏర్పడింది. టీ బ్రేక్ అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ పోడియంపైకి వెళ్లి నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పైకి పేపర్లు చించి విసిరేశారు. ఈలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.
ఈలలు వేసుకుంటూనే బయటికి
టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయినా వారు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు కూడా ఈలలు వేసుకుంటూనే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు.