జవహర్ రెడ్డిని కలసిన సోమేశ్ కుమార్

సోమేశ్ కుమార్ ఏపీకి వచ్చి సీఎస్ జవహర్ రెడ్డిని కలవడంతో ఈ ఎపిసోడ్ సుఖాంతమయినట్టయింది. ఏపీ ప్రభుత్వం కూడా సోమేశ్ కుమార్‌ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Update:2023-01-12 11:45 IST

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) ఆదేశాల మేరకు ఏపీకి వచ్చిన ఆయన, కాసేపటి క్రితం విజయవాడలోని సీఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలసి రిపోర్ట్ చేశారు. ఏపీలో ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు.

గత కొన్ని రోజులుగా సోమేశ్ కుమార్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ 2014లో సోమేశ్‌ కుమార్‌ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(DOPT) 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వాదనల అనంతరం సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో DOPT వెంటనే ఆయన్ను ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. ఈనెల 12లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని చెప్పింది. ఓ దశలో సోమేశ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకున్నా.. ఆయన ఈరోజు ఏపీకి వచ్చి సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. ఒక అధికారిగా తాను DOPT ఆదేశాలు పాటిస్తానని, ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని అన్నారు. వీఆర్ఎస్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతానన్నారు.

2019 డిసెంబరు 31న తెలంగాణ సీఎస్‌ గా నియమితులైన సోమేశ్‌ కుమార్‌, మూడేళ్లకు పైగా పదవిలో కొనసాగారు. ఈ సంవత్సరం డిసెంబరు 30తో ఆయన సర్వీసు కాలం ముగుస్తుంది. ఇప్పుడు ఏపీకి వెళ్తే సీఎస్ కంటే తక్కువ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ ఉంది. అయితే సోమేశ్ కుమార్ ఏపీకి వచ్చి సీఎస్ జవహర్ రెడ్డిని కలవడంతో ఈ ఎపిసోడ్ సుఖాంతమయినట్టయింది. ఏపీ ప్రభుత్వం కూడా సోమేశ్ కుమార్‌ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News