దీక్ష మొదలుకాకుండానే ఆస్ప‌త్రికి హరిరామ జోగయ్య

జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హరిరామ జోగయ్యతో చర్చలు జరిపారు. దాదాపు 400 మంది పోలీసులు పాలకొల్లులోని హరిరామ జోగయ్య ఇంటి వద్దకు వచ్చారు.

Advertisement
Update:2023-01-02 08:17 IST

కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి, సీనియర్ నేత హరిరామజోగయ్య మొదలుపెట్టనున్న దీక్షను పోలీసులు ముందే అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఆయన నివాసానికి ఆదివారం వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు దీక్ష ఆలోచన విరమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

దీక్ష ఆలోచన విరమించుకునేందుకు హరిరామ జోగయ్య ససేమిరా అనడంతో పోలీసులు ఆయన్ని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు వైద్యుల బృందం వచ్చి జోగయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించింది. 86 ఏళ్ల జోగయ్య దీక్ష చేయడం సరికాదని వైద్యులు సూచించారు. దీక్ష చేయ‌కుండా ఒప్పించేందుకు జోగ‌య్య‌కు సన్నిహితులైన నేతల ద్వారా కూడా పోలీసులు ప్రయత్నాలు చేశారు. అవేవీ ఫలించలేదు.

పోలీసులు తన నివాసానికి రావడంతో ఆ క్షణం నుంచి తాను దీక్ష మొదలుపెట్టినట్టు ఆయన ఒక దశలో ప్రకటించారు. నిజానికి సోమవారం ఉదయం 9 గంటల నుంచి కాపు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష మొదలుపెట్టబోతున్నట్టు ఇదివరకు హరిరామ జోగయ్య వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు నాయకులు కూడా ఆదివారం హరిరామజోగయ్యను కలిసి దీక్షకు మద్దతు తెలిపారు.

అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హరిరామ జోగయ్యతో చర్చలు జరిపారు. దాదాపు 400 మంది పోలీసులు పాలకొల్లులోని హరిరామ జోగయ్య ఇంటి వద్దకు వచ్చారు. దీక్ష ఆలోచన విరమించేందుకు అంగీకరించకపోవడంతో ఆయన కూర్చున్న కుర్చీతోపాటు అంబులెన్స్ లోనికి ఎక్కించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు .

అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ప్రత్యేకంగా కేటాయించాలి అన్నది హరిరామ జోగయ్య డిమాండ్. జోగయ్య దీక్ష మొదలు కాకముందే పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించడం, ఆయన వయస్సు 86 ఏళ్లు కావడంతో హరిరామ జోగయ్య తన కార్యాచరణలో ముందుకు వెళ్లడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News