నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శరత్‌చంద్రారెడ్డి.?
ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయనను నెల్లూరు రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత జగన్. గెలుపే టార్గెట్‌గా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏడు విడతల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు జగన్. అవసరమైతే ఈ జాబితాల్లోనూ మార్పులు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు.. వైసీపీకి కంచుకోట. అలాంటి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డిని బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయనను నెల్లూరు రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని మొదటగా నెల్లూరు ఎంపీగా బరిలో నిలిపేందుకు వైసీపీ ప్రయత్నించింది. కానీ, నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను చెప్పిన అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలని వేమిరెడ్డి కోరారని సమాచారం.
వేమిరెడ్డి ప్రతిపాదనకు జగన్ ససేమిరా అన్నారని తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే మరోసారి ఆదాలను ఎంపీకి పోటీ చేయించాలని వైసీపీ ప్రయత్నించగా.. ఆదాల అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జగన్ ఫైనల్ చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శరత్ చంద్రారెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లానే. ప్రస్తుతం శరత్ చంద్రా రెడ్డి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.