పూనకాలు, అరుపులు, తిట్లు..
సీఎం జగన్ పాలనను విమర్శిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వారు అధికారంలోకి వస్తే జగన్ పథకాలను తొలగిస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు సజ్జల. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు అవసరం లేవని చెప్పగలరా అని నిలదీశారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అంతా పూనకాలు, అరుపులు, తిట్లతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రుషికొండలో పవన్ విన్యాసాలు అందరూ చూశారని చెప్పారు. ఆ విన్యాసాలకు అవసరమైన అరేంజ్ మెంట్స్ ని చంద్రబాబు చేశారన్నారు. పవన్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఏపీ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు సజ్జల.
చంద్రబాబు ఉన్మాది..
చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సజ్జల. చంద్రబాబు పచ్చి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, అప్పుడు వద్దన్న సీబీఐని ఇప్పుడు కావాలంటున్నారని విమర్శించారు. ప్రజలు పిచ్చి వాళ్లని చంద్రబాబు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పద్దతి ప్రకారం బురదజల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపుతున్నారని, తమకు చట్టాలు, రాజ్యాంగం వర్తించవు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వారు చేసే తప్పులని ప్రశ్నిస్తే తమపైనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రచారం పేరుతో పుంగనూరులో చంద్రబాబు అరాచకం సృష్టించారని మండిపడ్డారు సజ్జల.
ఆపని చేయగలరా..?
సీఎం జగన్ పాలనను విమర్శిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వారు అధికారంలోకి వస్తే జగన్ పథకాలను తొలగిస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు సజ్జల. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు అవసరం లేవని చెప్పగలరా అని నిలదీశారు. ఏపీలో జగన్ పాలన అద్భుతంగా సాగుతోందని, సుమారు 90 శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని, పథకాల అమలు తీరుపై ప్రజల్లో సంతృప్తి ఉందని చెప్పారు. తమ పాలనను వేలెత్తి చూపించడానికి చంద్రబాబుకి అవకాశమే లేదన్నారు సజ్జల.