ఏపీలో ముందస్తుపై సజ్జల కీలక వ్యాఖ్యలు..
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తారా, ఏపీలో జగన్ కి వ్యతిరేకంగా పనిచేస్తారా అనే ప్రశ్నకు కూడా సజ్జల సమాధానం చెప్పారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ జరుగుతున్న హడావిడి తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ పుకార్లు మరింత ఎక్కువగా షికార్లు చేస్తున్నాయి. అయితే అవి వట్టి పుకార్లేనని మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఐదేళ్ల పాలనను వైసీపీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందని తేల్చేశారు.
ఏపీలో వైసీపీ ముందస్తుకి వెళ్లే అవకాశాలు లేవన్నారు సజ్జల. అదంతా కొన్ని పార్టీలు, మీడియా సంస్థలు చేసే హడావిడి మాత్రమేనని అన్నారు. తమకు సంబంధించినంత వరకు ప్రజలు ఐదేళ్ల పాలనకు అవకాశమిచ్చారని, ఆఖరి రోజు వరకు దాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో చేయాల్సినవి ఇంకా ఉన్నాయని, హడావిడిగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతిపక్షాలకు ముందస్తు తొందర ఉండొచ్చన్నారు సజ్జల. పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెచ్చేందుకు, ఆయన్ను పొత్తుకోసం ఒప్పించేందుకు చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉండొచ్చన్నారు. టీడీపీ నుంచే ఈ ముందస్తు ప్రచారం మొదలైందన్నారు. ఢిల్లీలో జగన్ మీటింగ్ లకు వెళ్తే, సోఫా కింద కూర్చుని ఎవరైనా వింటారా అని ప్రశ్నించారాయన. అలా విన్నట్టే మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
జగన్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఆ పాజిటివ్ ఓట్లు తమకు మరోసారి అధికారాన్నిస్తాయని ధీమా వ్యక్తం చేశారు సజ్జల. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు.. ప్రతిపక్షాల విష ప్రచారాలను పట్టించుకోవట్లేదనన్నారు. 175 సీట్ల టార్గెట్ తోనే తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని, అందులో అనుమానం ఏమీ లేదన్నారు.
కాంగ్రెస్ లో షర్మిల చేరికపై..
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తారా, ఏపీలో జగన్ కి వ్యతిరేకంగా పనిచేస్తారా అనే ప్రశ్నకు కూడా సజ్జల సమాధానం చెప్పారు. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టాక అదంతా షర్మిల వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆమె నిర్ణయంలో తామెలా కలుగజేసుకుంటామని ప్రశ్నించారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. పూర్తిగా అది ఆమె వ్యక్తిగతమని, ఆ పార్టీకీ సంబంధించిందని చెప్పారు.