ఏపీలో దొంగ ఓట్ల రాజకీయం.. పోటా పోటీగా ఈసీకి ఫిర్యాదులు
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంలో వైసీపీపై నిందలు వేసేవారంతా చంద్రబాబు ఏజెంట్లేనని ఎద్దేవా చేశారు సజ్జల. చంద్రబాబు ఏజెంట్లు అందరూ ఆర్కెస్ట్రా లా మాట్లాడుతున్నారని చెప్పారు. బీజేపీ కూడా దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు.
ఏపీలో దొంగ ఓట్లు నమోదయ్యాయనే విషయం బహిరంగ రహస్యం. అయితే ఆ ఓట్లు మీవంటే మీవంటూ టీడీపీ, వైసీపీ నిందలు వేసుకుంటున్నాయి. టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారని చంద్రబాబు అంటుంటే, వైసీపీ ఓట్లపై రాద్ధాంతం చేస్తున్నారంటూ సజ్జల రామృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. పోటా పోటీగా ఇరు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు పరుగలు పెడుతున్నాయి.
ఉరవకొండలో దొంగ ఓట్ల రద్దు విషయంలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడటంతో ఈ వ్యవహారం హైలైట్ గా మారింది. దీన్ని మరికాస్త సాగదీసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారని, ఇదెక్కడి ఘోరమని అంటున్నారు సజ్జల. ఈసీకి తాము కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. దొంగ ఓట్ల అసలు దొంగ చంద్రబాబు అంటూ కౌంటర్ ఇచ్చారు. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో 60 లక్షల ఓట్లు ఎవరివో తెలియని పరిస్థితి ఉందని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని తొలుత వైసీపీ భావించిందని చెప్పారు సజ్జల. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే ఆయన హడావిడిగా ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. ఉరవకొండలో ఓట్ల రద్దును ఎన్నికల సంఘం తప్పు పట్టలేదని, రద్దు ప్రక్రియను మాత్రమే తప్పుబట్టిందని వివరించారు. ఇదేదో జాతీయ సమస్య అయిపోయినట్టు టీడీపీ ఎందుకంత గగ్గోలు పెడుతోందని ప్రశ్నించారు. సేవా మిత్ర అనే యాప్ ద్వారా గతంలో చంద్రబాబు 50లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు సజ్జల.
అందరూ ఆయన ఏజెంట్లే..
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంలో వైసీపీపై నిందలు వేసేవారంతా చంద్రబాబు ఏజెంట్లేనని ఎద్దేవా చేశారు సజ్జల. చంద్రబాబు ఏజెంట్లు అందరూ ఆర్కెస్ట్రా లా మాట్లాడుతున్నారని చెప్పారు. బీజేపీ కూడా దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లను తీయించలేని పరిస్థితిలో ఈసీ ఉందని బండి సంజయ్ చెప్పదలుచుకున్నారా? అని మండిపడ్డారు. టీడీపీ గోబెల్స్ ప్రచారాన్ని ఖండించకపోతే అదే నిజం అని ప్రజలు నమ్మే అవకాశం ఉందన్నారు. దొంగ ఓట్ల విషయంలో వైసీపీ నేతలే అసలు బాధితులు అని చెప్పారు సజ్జల.