అది నా దురదృష్టం, పవన్ దురదృష్టం.. మళ్లీ పేలిన వర్మ తూటాలు
పవన్ అభిమానిగానే తాను ఆ ట్వీట్లు చేశానని, అది అర్థం కాకపోవడం తన దురదృష్టం, పవన్ దురదృష్టం అని అన్నారు వర్మ. నాగబాబు వంటి సలహాదారులను పెట్టుకుంటే పవన్ ఔట్ కమ్ ఏంటో జనమే చెబుతారని విమర్శించారు.
నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాలంటూ రామ్ గోపాల్ వర్మను మీడియా గుచ్చి గుచ్చి అడిగినా సైలెంట్ గా ఉన్నారు. కానీ రాత్రి ఇంటికెళ్లాక మాత్రం ట్విట్టర్లో ఓ ఘాటు వీడియో పెట్టారు. నాగబాబు ఆయన అన్నయ్యకి, తమ్ముడికి ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు కానీ, తనకు కాదన్నారు రామ్ గోపాల్ వర్మ.
పవన్ అభిమానిగానే తాను ఆ ట్వీట్లు చేశానని, అది అర్థం కాకపోవడం తన దురదృష్టం, పవన్ దురదృష్టం అని అన్నారు వర్మ. నాగబాబు వంటి సలహాదారులను పెట్టుకుంటే పవన్ ఔట్ కమ్ ఏంటో జనమే చెబుతారని విమర్శించారు.
ఆమధ్య చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయిక తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎంత హడావిడి చేశారో చూస్తూనే ఉన్నాం. కమ్మ, కాపు రాజకీయాలపై ఆయన వరసబెట్టి ట్వీట్లు వేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఏపీ మంత్రులపై వేసిన సెటైర్లకు వర్మ నుంచి కౌంటర్లు పడ్డాయి. ఇస్పేట్ రాజా అంటూ పవన్ కల్యాణ్ ని విమర్శించారు వర్మ. అయితే అటు జనసేన నుంచి నాగబాబు కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు.
వర్మను నీచ్ కమీనే కుత్తే అని అన్నారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఆగింది. ఆ తర్వాత వర్మ ఇప్పుడు ఏపీలో కోడిపందేలు చూసేందుకు వచ్చారు. నేరుగా మీడియా ముందుకొచ్చాక మాత్రం వర్మ సైలెంట్ అయిపోయారు. ట్విట్టర్లో ఘాటుగా బదులిచ్చే వర్మ బయట మాత్రం సైలెంట్ గా ఉన్నారు. నాగబాబు వ్యాఖ్యలపై స్పందించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. కానీ కోడిపందేల అనంతరం ఇంటికెళ్లాక ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు వర్మ.
ఏపీకి వచ్చే ముందు కూడా..
ఏపీకి వచ్చే ముందు కూడా వర్మ తనదైన శైలిలో ట్వీట్ వేశారు. జీవితంలో మొట్ట మొదటి సారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనబోతున్నానని, దాని వెనక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని, తనను ద్వేషించే పార్టీ మీద ఒట్టేసి చెప్తున్నానంటూ ట్వీట్ వేశారు వర్మ. ఆ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది.
కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నాగబాబు వ్యాఖ్యలపై నేరుగా స్పందించడానికి నిరాకరించినా, ఇప్పుడు ట్వీట్ తో మాత్రం మళ్లీ మంటపెట్టారు. నాగబాబు లాంటి సలహాదారుల్ని పెట్టుకోవద్దని పవన్ కి సలహా ఇచ్చారు. తాను పవన్ అభిమానిగానే ట్వీట్లు చేశానని, అది అర్థం చేసుకోవాలన్నారు. అలా తనను ఎవరూ అర్థం చేసుకోకపోవడం తన దురదృష్టం అంటున్నారు వర్మ.