ఏపీ రాజకీయాలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. షర్మిల ఎంట్రీ ఎప్పుడంటే..?

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయిందని రాహుల్ గాంధీ బాధపడినట్టు తెలిపారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. రాజధాని ప్రాంతంలో త్వరలో ప్రియాంకగాంధీ పర్యటిస్తారన్నారు.

Advertisement
Update:2023-07-03 05:48 IST

రాహుల్ గాంధీ బహిరంగ సభ తెలంగాణకే పరిమితం, సభలో ఆయన తెలంగాణ రాజకీయాల గురించే మాట్లాడారు. అయితే రాహుల్ ఏపీ కాంగ్రెస్ నాయకులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఢిల్లీ నుంచి విజయవాడకు విమానంలో వచ్చిన రాహుల్ గాంధీ, అక్కడినుంచి ఖమ్మం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూడా ఆయన విజయవాడ నుంచే ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఆయనను విజయవాడలో కలిశారు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.

అమరావతిపై కామెంట్..

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయిందని రాహుల్ గాంధీ బాధపడినట్టు తెలిపారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. రాహుల్ తో కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతికే కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ చెప్పారన్నారు. రాజధాని ప్రాంతంలో త్వరలో ప్రియాంకగాంధీ పర్యటిస్తారన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల కష్టాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విభజన హామీలు ఇంకా అమలు కాలేదని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ఏపీకి అన్యాయం జరుగుతోందని రాహుల్ కి గుర్తు చేశామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన హామీలను అమలు చేసి, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు.

ఏపీలో రాహుల్ పర్యటన..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సిన సందర్భంలో.. రెండు తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కూడా రాహుల్ గాంధీ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు ఈ నెల లేదా వచ్చే నెలలో రాహుల్ విశాఖకు వస్తారని తెలిపారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమన్నారు.

షర్మిల ఎంట్రీ ఎప్పుడంటే..?

వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. షర్మిల ఎంట్రీపై తమకు సమాచారం ఉందన్నారు. వైఎస్ఆర్ బిడ్డగా ఆమె కాంగ్రెస్ లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ నష్టపోయిందని గుర్తు చేశారు కేవీపీ. 

Tags:    
Advertisement

Similar News